ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్‌కు ముందు టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో పరుగుల వరద పారించిన యశస్వి జైస్వాల్.. గత నాలుగు మ్యాచ్‌ల్లో 655 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం.
ఇక ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ మరో 45 పరుగులు చేస్తే పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంటాడు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్‌ల్లో 700 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కనున్నాడు. మరో 98 పరుగులు చేస్తే ఇరు జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవనున్నాడు.

ఈ జాబితాలో ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ గ్రహమ్ గూచ్(752) అగ్రస్థానంలో ఉన్నాడు. 1990లో ఇంగ్లండ్ వేదికగా భారత్‌తో జరిగిన 3 టెస్ట్‌ల సిరీస్‌లో 752 పరుగులు చేశాడు. 2021 ఇంగ్లండ్ పర్యటనలో జోరూట్ భారత్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 737 రన్స్ చేశాడు. ఈ రెండు రికార్డులు కూడా యశస్వి జైస్వాల్‌ను ఊరిస్తున్నాయి.
మరో 119 పరుగులు చేస్తే ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలవనున్నాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ బ్యాటర్లు సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీల రికార్డులను అధిగమించనున్నాడు. ప్రస్తుతం ఈ జాబితాలో యశస్వి జైస్వాల్ 655 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. సునీల్ గవాస్కర్ 774, 732 పరుగులతో తొలి రెండు స్థానాల్లో ఉండగా.. విరాట్ కోహ్లీ 692, 655 పరుగులతో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాడు.
సునీల్ గవాస్కర్ 1970లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 774 రన్స్ స్కోరు చేశాడు. మళ్లీ 1978లో అదే జట్టుపై గావస్కర్ 732 పరుగులు చేశాడు.విరాట్ కోహ్లీ 2014లో ఇంగ్లండ్‌పై 692, 2016లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లోనే 655 పరుగులు చేశాడు. ప్రస్తుతం సిరీస్ 655 పరుగులు చేసిన జైస్వాల్..మరో 37 పరుగులు చేస్తే కోహ్లీ.. 119 రన్స్ చేస్తే సునీల్ గవాస్కర్ రికార్డును బ్రేక్ చేస్తాడు. అదే జరిగితే 54 ఏళ్ల తర్వాత ఈ రికార్డును అధిగమించిన బ్యాటర్‌గా భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోతాడు.
యశస్వి జైస్వాల్ ప్రస్తుత ఉన్న ఫామ్ ప్రకారం.. ఈ రికార్డ్ అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిసి సునాయసంగా ఈ ఫీట్ సాధించగలడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-1తో కైవసం చేసుకుంది. చివరి టెస్టులో ఓడినా.. డ్రా చేసుకున్నా సిరీస్ భారత్ వశం అవుతోంది. అయితే డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానం చేరాలంటే ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకు కీలకం.