టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలు అందించిన ఆత్మవిశ్వాసంతోనే సెంచరీ సాధించానని టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అన్నాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో శుక్రవారం వైజాగ్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్ట్‌లో యశస్వి జైస్వాల్(257 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 179 బ్యాటింగ్) విధ్వంసకర శతకంతో చెలరేగాడు.
ఇతర బ్యాటర్లంత విఫలమవ్వగా.. యశస్వి ఒక్కడే అసాధారణ ప్రదర్శనతో భారత జట్టును ఆదుకున్నాడు. యశస్వి సూపర్ బ్యాటింగ్‌తో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 93 ఓవర్లలో 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లుగా బ్యాటింగ్ చేసి యశస్వి.. డబుల్ సెంచరీకి 21 పరుగుల దూరంలో ఉన్నాడు.

తొలి రోజు ఆట అనంతరం తన ఇన్నింగ్స్‌పై స్పందించిన యశస్వి.. రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ అందించిన సహకారంతోనే ఈ సెంచరీ సాధ్యమైందని చెప్పాడు. అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియో సినిమాతో మాట్లాడిన యశస్వి.. కోచ్, కెప్టెన్ ఆదేశాలను తాను పాటించానని తెలిపాడు.'ఈ మ్యాచ్‌లో సెషన్ బై సెషన్ ఆడాలనుకున్నాను. వారు బాగా బౌలింగ్ చేస్తున్నప్పుడు.. ఆ స్పెల్‌ను ఎలాగైనా అధిగమించాలనుకున్నాను.
ఆట ఆరంభంలో వికెట్ తడిగా ఉండటంతో పాటు స్పిన్‌కు అనుకూలించింది. బౌన్స్ కూడా లభించింది. ఈ పరిస్థితుల్లో నేను లూజ్ బాల్స్‌ను బౌండరీలుగా మార్చాలనుకున్నాను. అలాగే చివరి వరకు బ్యాటింగ్ చేయాలనే లక్ష్యంతో నా ఆటను కొనసాగించాను. నా స్కోర్‌ను రెట్టింపు చేయడంతో పాటు జట్టు కోసం చివరి వరకు ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నా.
రేపు ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నా. పిచ్ కాస్త భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఉదయం తడిగా ఉండి తర్వాత నిలకడగా మారే ఛాన్సుంది. బంతి పాత బడితే బౌన్స్ అవుతోంది. రాహుల్ సర్, రోహిత్ భాయ్ నా ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. నేను అందించిన ఆరంభాన్ని పెద్ద ఇన్నింగ్స్‌గా మలచాలని, చివరి వరకు క్రీజులో ఉండాలని చెప్పారు.'అని యశస్వి జైస్వాల్ చెప్పుకొచ్చాడు.
యశస్వి మినహా మరే బ్యాటర్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. కానీ యశస్వితో కలిసి స్వల్ప భాగస్వామ్యాలు నెలకొల్పారు. దాంతో టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది. యశస్వి తర్వాత శుభ్‌మన్ గిల్(34), రజత్ పటీదార్(32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్‌తో పాటు రవిచంద్రన్ అశ్విన్(5 బ్యాటింగ్) ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. టామ్ హార్ట్‌లీ, జేమ్స్ అండర్సన్ చెరో వికెట్ పడగొట్టారు.