
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో నేటి(శుక్రవారం) నుంచి జరిగే చివరి పోరులో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌ని కనీసం డ్రా చేసుకున్నా సిరీస్ చేజిక్కనుంది. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇటీవల ముగిసిన నాలుగో టెస్టులో 157 పరుగుల తేడాతో భారత్ గెలుపొందిన విషయం తెలిసిందే.
వాస్తవానికి ఈ ఫైనల్ టెస్టు జరగడంపై గురువారం పెద్ద ఎత్తున సందిగ్ధత నెలకొంది. టీమిండియాతో కలిసి బుధవారం రాత్రి వరకూ ఉన్న జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కి గురువారం కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో.. భారత క్రికెటర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హడావుడిగా గురువారం ప్రాక్టీస్ సెషన్‌ని రద్దు చేసుకుని హోటల్ గదులకే పరిమితమయ్యారు. కానీ.. ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లో గురువారం సాయంత్రం ఆటగాళ్లందరికీ నెగటివ్ రావడంతో.. ఐదో టెస్టుకి మార్గం సుగుమమైంది. ఇప్పటికే టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌కి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే.
కరోనా నేపథ్యంలో చివరి మ్యాచ్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసినా.. ఈసీబీ అతి తెలివి ప్రదర్శించడంతో మ్యాచ్ ఆడేందుకే కోహ్లీసేన సిద్దమైంది. దాంతో ఆఖరి టెస్ట్ షెడ్యూల్ ప్రకారమే ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీసేనను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్ గడ్డపై భారత్ జట్టు ఇప్పటి వరకూ కేవలం రెండు సార్లు మాత్రమే టెస్టు సిరీస్ గెలిచింది. 1986లో కపిల్‌దేవ్ కెప్టెన్సీలో 2-0, 2007లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో 1-0 తేడాతో అక్కడ టెస్టు సిరీస్‌లను గెలిచిన టీమిండియా.. ఈ ఫైనల్ టెస్టులో గెలిచి మూడోసారి ఆ ఘనత సాధించాలని ఆశిస్తోంది.
ఇదే జరిగితే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కూడా అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకోనున్నాడు. ఇప్పటికే కెప్టెన్‌గా ఆస్ట్రేలియాలో రెండు సార్లు టెస్టు సిరీస్‌లు గెలిచిన విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్‌లోనూ టెస్టు సిరీస్ గెలిస్తే..? ఈ ఘనత సాధించిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై ఇప్పటి వరకూ టెస్టు సిరీస్‌లో భారత్ జట్టు మూడు మ్యాచ్‌ల్లో గెలవలేదు.