
కోహ్లీ తప్పు చేశాడా?
అశ్విన్‌ను తీసుకోకుండా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పు చేశాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చివరి రోజు అశ్విన్ ఉంటే భారత్ విజయం మరింత సునాయసమయ్యేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మ్యాచ్ ప్రారంభమైన తొలి రోజే అశ్విన్‌ను తీసుకోకపోవడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. ఇక మ్యాచ్ చివరి రోజుకు దారి తీయడం.. విజయానికి భారత్ 10 వికెట్ల దూరంలో నిలవడంతో ఈ విమర్శలు మరీ ఎక్కువయ్యాయి. ప్రస్తుత పరిస్తితులతో అశ్విన్ విలువ ఏంటో కోహ్లీకి తెలుసొస్తుందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు.

అశ్విన్ ఉంటే..
బ్యాటింగ్‌కు అనుకూలమైన ఓవల్ వికెట్‌పై టర్నింగ్ లభిస్తుంది. నాలుగో రోజు ఆటలో క్రీజులో కుదురుకున్న రిషభ్ పంత్-శార్దల్ ఠాకూర్‌ను కెప్టెన్ జోరూట్ వీడదీయడంతో ఈ విషయం స్పష్టంగా తెలిసింది. అంతకుముందు హాఫ్ సెంచరీకి చేరువైన కోహ్లీని కూడా స్పిన్నర్ మొయిన్ అలీనే ఔట్ చేశాడు. ఈ పరిస్థితుల్లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉంటే.. ఇంగ్లండ్ మరింత కష్టమయ్యేదని విశ్లేషకులు అంటున్నారు. పైగా ఓవల్‌లో అశ్విన్‌కు మంచి రికార్డు ఉంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు ఇదే వేదికగా కౌంటీ క్రికెట్ ఆడిన అశ్విన్ 6 వికెట్లు తీశాడు. వీటిని పట్టించుకోని టీమిండియా.. బ్యాటింగ్ డెప్త్ కోసం జడేజాను తీసుకుంది.

ఫామ్‌లో ఉన్న అశ్విన్‌ను కాదని..
ఈ ఏడాది జూన్‌లో సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అశ్విన్ 45 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. 2016 నుంచి ఆసియా వెలుపల 28.08 సగటుతో అశ్విన్ మిగతా స్విన్నర్ల కంటే ఉత్తమ గణాంకాలతో టాప్ లో ఉన్నాడు. అశ్విన్ గత నెలలో ఓవల్‌లోనే సోమర్‌సెట్‌తో జరిగిన కౌంటీ మ్యాచ్‌లో సర్రే జట్టు తరఫున ఆడి 27 పరుగులిచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. ఇటువంటి పరిస్థితిలో, అశ్విన్ జట్టుకు దూరంగా ఉంచడం ఆశ్చర్యపరిచే విషయమే.

స్పిన్‌కు అనుకూలమైన..
ఓవల్ మైదానంలో స్పిన్నర్ల గణాంకాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఇంతకు ముందు స్పిన్ బౌలర్లు ఈ మైదానంలో అద్భుతంగా రాణించారు. 1998లో శ్రీలంక స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ 65 పరుగులు ఇచ్చి తొమ్మిది వికెట్లు తీశాడు. 1997లో స్పిన్ బౌలర్ ఫిల్ తుఫ్నెల్ అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో, ఆస్ట్రేలియాను 104 పరుగులకే ఆలౌట్ చేసి ఇంగ్లండ్ విజయం సాధించింది.స్పిన్ బౌలర్లు ఇప్పటికీ ఈ పిచ్‌లో అద్భుతంగా రాణిస్తున్నారని ఇటీవలి తాజా గణాంకాలను బట్టి కూడా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












