ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టీ20లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా మ్యాచ్ మధ్యలో తుది జట్టులోకి వచ్చాడు. నాటకీయ పరిణామాల మధ్య అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్‌తో మూడు వికెట్లు తీసాడు. మ్యాచ్‌కు ముందు తుది జట్టులో లేని హర్షిత్ రాణా బౌలింగ్ చేయడం చర్చనీయాంశమైంది. అసలు హర్షిత్ రాణా జట్టులోకి వచ్చిన విషయమే ఆలస్యంగా తెలిసింది.
రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో జోస్ బట్లర్ ఇచ్చిన క్యాచ్‌ను హర్షిత్ రాణా అద్భుతంగా అందుకున్నాడు. ఆ క్షణమే కామెంటేటర్లు హర్షిత్ రాణా జట్టులోకి వచ్చిన విషయాన్ని గుర్తించారు. అయితే సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా బరిలోకి దిగాడేమోనని అంతా అనుకున్నారు. కానీ బౌలింగ్ చేయడానికి సిద్దం కావడంతో షాకయ్యారు. అయితే హర్షిత్ రాణా శివమ్ దూబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు.

ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన శివమ్ దూబేకు ఆఖరి ఓవర్‌లో జేమీ ఓవర్టన్ వేసిన బౌన్సర్ బలంగా తాకింది. దాంతో ఫిజియోలు పరుగెత్తుకొని వచ్చి కంకషన్ టెస్ట్ చేశారు. బ్యాటింగ్ కొనసాగించిన దూబే.. ఆఖరి బంతికి రనౌటయ్యాడు. అయితే రూల్స్ ప్రకారం కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను ఆడించే అవకాశం ఉండటంతో భారత్.. తెలివిగా హర్షిత్ రాణాను బరిలోకి దించింది. ఇక హర్షిత్ రాణాకు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం విశేషం. అతను 4 ఓవర్లు బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు తీసాడు. సంచలన ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యాతో పాటు శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. రింకూ సింగ్(26 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30), అభిషేక్ శర్మ(19 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 29)పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహమూద్(3/35) మూడు వికెట్లు తీయగా.. జేమీ ఓవర్టన్(2/32) రెండు వికెట్లు పడగొట్టారు. బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. హ్యారీ బ్రూక్(26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా(3/33), రవి బిష్ణోయ్(3/28) మూడేసి వికెట్లు తీయగా. వరుణ్ చక్రవర్తీ(2/28) రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్(1/35), అక్షర్ పటేల్(1/26) చెరో వికెట్ తీసుకున్నారు. ఈ గెలుపుతో 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది.