
బర్మింగ్‌హామ్: భారత్-ఇంగ్లండ్ మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రీషెడ్యూల్ ఐదో టెస్ట్ అనూహ్య మలుపు తిరిగింది. 378 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 259 పరుగులు చేసింది. జానీ బెయిర్ స్టో(72 బ్యాటింగ్), జోరూట్(76 బ్యాటింగ్) అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో మ్యాచ్‌పై ఇంగ్లండ్ పట్టు బిగించింది. మూడు రోజుల పాటు భారత్‌ను ఊరించిన విజయం ఇప్పుడు ఇంగ్లండ్ వైపు మళ్లింది. ఈ క్రమంలోనే ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సెటైర్లు పేల్చాడు.
భారత ఇన్నింగ్స్ సందర్భంగా పూర్తిగా బౌలర్లకు సహకరించిన వికెట్.. ఇంగ్లండ్ బ్యాటింగ్ టైమ్‌లో మాత్రం మారిపోయింది. భారత బ్యాటింగ్ టైమ్‌లో బంతి స్వింగ్ అవ్వగా.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా వికెట్ ఫ్లాట్‌గా మారింది. స్వింగ్ దేవుడెరుగు బంతి నేరుగా బ్యాట్‌పైకి వెళ్తుంది. దాంతో ఇంగ్లండ్ తొలి వికెట్‌కు 107 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందుకుంది. ఆ తర్వాత బుమ్రా రెండు వికెట్లు తీసినా ఫలితం లేకుండా పోయింది.
జానీ బెయిర్ స్టో, జోరూట్ నిలకడగా ఆడుతూ జట్టును విజయం వైపు నడిపిస్తున్నారు. 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేదించే ప్రయత్నం చేస్తున్నారు. నాలుగో వికెట్‌కు ఇప్పటికే 120+ రన్స్ భాగస్వామ్యం నమోదు చేసిన ఈ జోడీ.. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలుస్తోంది. ఇక విజయం ఖాయం అనుకున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు తడబడుతుండటం చూసి అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆశ్చర్యపోతున్నారు. వసీం జాఫర్ సైతం పిచ్ ఇంతలా మారడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఓ ఫన్నీ మీమ్‌ను ట్వీట్ చేశాడు. ఇన్నింగ్స్ బ్రేక్‌లో గ్రౌండ్స్‌మెన్ రోడ్ రోలర్‌తో పిచ్‌ను తొక్కించి ఉంటారని పేర్కొన్నాడు. దీనికి అక్షయ్ కుమార్ సినిమాలోని ఓ ఫొటోను జత చేశాడు. ప్రస్తుతం ఈ మీమ్ వైరల్‌గా మారింది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 122 పరుగులే కావాలి.
అంతకుముందు 125/3 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు కుప్పకూలింది. బెన్ స్టోక్స్(4/33) అద్భుత బౌలింగ్‌తో భారత్ పతనాన్ని శాసించాడు. ఓవర్ నైట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా(66)భారీ ఇన్నింగ్స్ ఆడటంలో విఫలమవ్వగా.. రిషభ్ పంత్ (57) హాఫ్ సెంచరీతో రాణించాడు. కానీ ఇతర బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా(27), మహమ్మద్ షమీ(13), జస్‌ప్రీత్ బుమ్రా(7) చేతులెత్తేయడంతో భారత్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. 132 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్ ముందు 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్‌కు తోడుగా స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పోట్స్ రెండేసి వికెట్లు తీయగా.. అండర్సన్, జాక్ లీచ్ చెరో వికెట్ పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్(రిషభ్ పంత్ 146, రవీంద్రజడేజా 104, జేమ్స్ అండర్సన్ 5/60)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్(జానీ బెయిర్ స్టో 106, సామ్ బిల్లింగ్స్ 36, మహమ్మద్ సిరాజ్ 4/66)
భారత్ రెండో ఇన్నింగ్స్ 245 ఆలౌట్( పుజారా 66, రిషభ్ పంత్ 57, బెన్ స్టోక్స్ 4/33)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ : 57 ఓవర్లలో 259/3 (బెయిర్ స్టో 72 బ్యాటింగ్, జోరూట్ 76 బ్యాటింగ్)