
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తప్పుబట్టాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో ఆ జట్టు బ్యాటర్ జానీ బెయిర్ స్టోను విరాట్ కోహ్లీ అనవసరంగా గెలికాడని ట్వీట్ చేశాడు. విరాట్ కోహ్లీ కవ్వింపులతో చతేశ్వర పుజారాలా ఆడుతున్న జానీ బెయిర్ స్టో.. రిషభ్ పంత్‌లా ఉగ్రరూపం దాల్చాడని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
'విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్ చేయక ముందు జానీ బెయిర్ స్టో స్ట్రైక్‌రేట్ 21. తర్వాత 150. పుజారాలా ఆడుతున్న బెయిర్ స్టో.. కోహ్లీ కవ్వింపులతో రిషభ్ పంత్‌లా చెలరేగాడు'అని సెహ్వాగ్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. 84/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ఇంగ్లండ్ ప్రారంభించగా.. ఆరంభంలోనే బెయిర్ స్టోతో కోహ్లీ వాగ్వాదానికి దిగాడు.
మహమ్మద్ షమీ వేసిన 32వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. షమీ బౌలింగ్‌లో బెయిర్‌స్టో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడగా.. అతన్ని చూసి స్లిప్‌లో ఉన్న కోహ్లీ నవ్వాడు. అంతటితో ఆగకుండా బెయిర్ స్టోకు బంతి తప్పా మైదానంలో ఉన్నవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయని స్లెడ్జ్ చేశాడు. ఈ వ్యాఖ్యలతో చిర్రెత్తుకుపోయిన బెయిర్ స్టో.. నోరు మూసుకో అంటూ సైగలు చేశాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కోహ్లీ అతని మీదికి దూసుకు రాగా.. అంపైర్లు జోక్యం చేసుకొని వెనక్కి పంపించారు. అయినా తగ్గని కోహ్లీ నోరు మూసుకొని బ్యాటింగ్ చేయమని సైగలు చేశాడు. అయితే ఆ ఓవర్ అనంతరమే ఇద్దరూ కలిసి మాట్లాడుకొని గొడవకు స్వస్తీ పలికారు. ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్నారు. ఈ ఘటనను ఉద్దేశించే సెహ్వాగ్ సెటైరికల్‌గా ట్వీట్ చేయగా.. కోహ్లీ ఫ్యాన్స్ అతన్ని తప్పుబడుతున్నారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. 84/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు కుప్పకూలింది. జానీ బెయిర్ స్టో(140 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 106) సెంచరీతో ఆదుకున్నాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్(25) కలిసి ఆరో వికెట్‌కు 66 పరుగులు జోడించిన బెయిర్ స్టో.. సామ్ బిల్లింగ్స్(36)తో కలిసి ఏడో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం అందించాడు. దాంతో ఇంగ్లండ్ ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకుంది. ఇక భారత బౌలర్లలో సిరాజ్‌కు తోడుగా బుమ్రా మూడు వికెట్లు తీయగా.. షమీ రెండు, శార్దూల్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆదిలోనే ఓపెనర్ శుభ్‌మన్ గిల్(4) వికెట్ కోల్పోయింది. దాంతో సెకండ్ సెషన్ ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది.