ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌పై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ భారత పర్యటనకు రానుంది. జనవరి 25 నుంచి ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సుదీర్ఘ పర్యటనలో తమ ఆటగాళ్లు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది.
ఇందుకోసం ఇంగ్లండ్ జట్టుతో ఓ వంటవాడిని పంపిస్తోంది. ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఫుడ్ పాయిజన్ కావొద్దని, ఎలాంటి అస్వస్థతకు గురికావద్దని ఈ నిర్ణయం తీసుకుంది. ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ దిగ్గజ జట్టు అయిన మాంచెస్టర్ యునైటెడ్ చెఫ్‌ను ఇంగ్లండ్ జట్టు భారత్‌కు తీసుకొస్తున్నట్లు బ్రిటీష్ మీడియా పేర్కొంది.

స్పైసీ ఫుడ్‌ను ఇష్టపడే తమ ఆటగాళ్లకు పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వడానికి ఈ చెఫ్ అవసరమని ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ బర్మీ ట్వీట్ చేయగా.. సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించాడు. 'కుక్(ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ టీమ్ కుక్) వెళ్లిపోయిన తర్వాత వారికి ఈ అవసరం ఏర్పడింది. ఐపీఎల్ సమయంలో వారికి ఏ కుక్ అవసరం ఉండదు'అని సెహ్వాగ్ సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు.
ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం ఈ వార్తలపై తనదైన శైలిలో స్పందించాడు. ఐపీఎల్ సమయంలోనూ మెజార్టీ ఇంగ్లీష్ ఆటగాళ్లు సొంతంగా చెఫ్‌లను తీసుకొస్తరని తెలిపాడు.
జనవరి 25న హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు ప్రారంభానికి ముందు చెఫ్ జట్టుతో చేరతాడని ప్రచారం జరుగుతోంది. ఇంగ్లండ్ జట్టు చెఫ్‌ను తెచ్చుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఒమర్ మెజియెన్ అనే చెఫ్ ఇంగ్లండ్ జట్టుతో పాటు వెళ్లాడు. ఆ సిరీస్‌ను బెన్ స్టోక్స్ సారథ్యంలో ఇంగ్లండ్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది.