IND vs ENG: ఉన్నండ్రా.. ఈ రోజు మీ సంగతి చూస్తా! ఇంగ్లండ్ ఆటగాళ్లకు కోహ్లీ వార్నింగ్!

ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలిసారి భారత్ ఒకరోజు మొత్తం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (256 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 127) నిలబడి సెంచరీతో కదంతొక్కితే... చతేశ్వర్ పుజారా (127 బంతుల్లో 9 ఫోర్లతో 61), కేఎల్ రాహుల్ (101 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 46) తమ వంతు పాత్ర పోషించారు. వెరసి శనివారం జరిగిన మూడు సెషన్లలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా... వెలుతురు మందగించి ఆటను నిలిపి వేసే సమయానికి 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (22 బ్యాటింగ్), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు కోహ్లీ, జడేజా కనీసం ఒక సెషనంతా నిలబడి... ఆ తర్వాత రహానే, రిషభ్ పంత్, శార్దుల్ ఠాకూర్ కూడా రాణిస్తే ఈ టెస్టులో భారత్ శాసించే స్థితికి చేరుకుంటుంది.
చూడ ముచ్చటైన ఫొటో...
అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మూడో రోజు ఆట ముగిసిన అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానం వీడుతుండగా.. ఇంగ్లండ్ ఆటగాళ్లంతా ఒక్కతాటికి చేరి అతని వెనుకాల వస్తున్నారు. ఈ క్రమంలో చంకలో బ్యాట్.. ఓ చేతిలో గ్లోవ్స్, మరోచేతిలో హెల్మెట్ పెట్టుకున్న కోహ్లీ.. వెనక్కుతిరిగి ఇంగ్లండ్ ఆటగాళ్ల వైపు ఓ లుక్కేశాడు. ఈ ఫొటో చూడముచ్చటగా ఉండగా.. అభిమానులు ఫన్నీ క్యాప్షన్స్‌తో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు 'ఉన్నండ్రా.. ఈ రోజు మీ సంగతి చూస్తా'అంటూ ఇంగ్లండ్ ఆటగాళ్లకు కోహ్లీ వార్నింగ్ ఇస్తున్నాడని సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇంకొందేరేమో.. 'ఎలా ఉందిరా మా బ్యాటింగ్.. దిమ్మ తిరిగి పోయిందా?'అని కోహ్లీ వారివైపు లుక్కేశాడని క్యాప్షన్‌గా పేర్కొంటున్నారు.

రోహిత్ సెంచరీ..
ఓవర్‌నైట్ స్కోరు 43/0తో శనివారం ఆటను కొనసాగించిన భారత ఓపెనర్లు రోహిత్, రాహుల్ నిలకడగా ఆడారు. బంతి కూడా పాతబడటంతో మన ఓపెనర్లను ఇంగ్లండ్ పేసర్లు పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. అయితే అండర్సన్ ఇంగ్లండ్‌కు తొలి బ్రేక్‌ను అందించాడు. అర్ధ సెంచరీ చేసేలా కనిపించిన రాహుల్... అండర్సన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మొదట అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా... రివ్యూకు వెళ్లిన ఇంగ్లండ్ వికెట్ సాధించుకుంది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి రోహిత్ భారత ఇన్నింగ్స్‌ను నిల బెట్టాడు. ముఖ్యంగా రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అలరించాడు. మొయిన్ అలీ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా సిక్సర్ బాదిన రోహిత్ 204 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు.

153 పరుగులు భాగస్వామ్యం..
టెస్టుల్లో విదేశీ గడ్డపై రోహిత్‌కిదే తొలి సెంచరీ కాగా... ఓవరాల్‌గా టెస్టుల్లో అతడికిది ఎనిమిదో శతకం. అంతేకాకుండా ఈ ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ టెస్టుల్లో 3000 పరుగులను పూర్తి చేశాడు. మరో పక్క పుజారా కూడా అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 153 పరుగులు జోడించారు. అయితే కొత్త బంతిని తీసుకున్న రూట్... రాబిన్సన్‌ను బౌలింగ్‌కు పిలిచాడు. కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న రాబిన్సన్... 81వ ఓవర్‌లో రోహిత్, పుజారాలను అవుట్ చేసి ఇంగ్లండ్‌కు డబుల్ బ్రేక్ ఇచ్చాడు. దాంతో భారత శిబిరంలో కాస్త ఆందోళన కలిగింది. కానీ కోహ్లి, జడేజా సంయమనంతో ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. వెలుతురు మందగించడంతో 13 ఓవర్లు మిగిలి ఉండగానే ఆటను ముగిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.

సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 191 ఆలౌట్ (విరాట్ కోహ్లీ 50, శార్దూల్ ఠాకూర్ 57, క్రిస్ వోక్స్ 4/55, ఓలీ రాబిన్సన్ 3/38)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 290 ఆలౌట్(ఓలీపోప్ 81, క్రిస్ వోక్స్ 50, ఉమేశ్ యాదవ్ 3/76, బుమ్రా 2/21)
భారత్ రెండో ఇన్నింగ్స్: 270/3 (రోహిత్ శర్మ 127, పుజారా 61, కేఎల్ రాహుల్ 46)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications