
హైదరాబాద్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఆఖరి మ్యాచ్ అనూహ్య పరిస్థితుల్లో రద్దయిన విషయం తెలిసిందే. భారత జట్టులో కరోనా కలకలం రేగడంతో శుక్రవారం మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు పరస్పర అంగీకారంతో మ్యాచ్‌ను రద్దు చేశాయి. భవిష్యత్తులో వీలు కుదిరినప్పుడు మ్యాచ్ నిర్వహిస్తామని తెలిపాయి. అయితే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ముందుగా తన ప్రకటనలో కరోనా కారణంగా భారత జట్టు మ్యాచ్ ఆడటానికి సిద్దంగా లేదని, వాకోవర్ ప్రకటించిందని తెలిపింది. ఫలితంగా ఐదు టెస్ట్‌ల సిరీస్ 2-2తో సమమైందని ప్రకటించింది.
ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ క్షణాల వ్యవధిలోనే ప్రకటనను మార్చింది. ఆటగాళ్లు భద్రతా దృష్ట్యా మ్యాచ్ రద్దయిందని, తదుపరి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ఈ అసౌకర్యానికి మన్నించాలని అభిమానులను కోరింది. అయితే ఈ రెండు రకాల ప్రకటనలతో భారత అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు కాస్త గందరగోళానికి గురయ్యారు. ఆ తర్వాత బీసీసీఐ సెక్రటరీ జై షా ఓ ప్రకటనను విడుదల చేయడంతో స్పష్టత వచ్చింది.
త్వరలోనే ఈ మ్యాచ్‌ను తిరిగి నిర్వహించేందుకు ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నామని జైషా ప్రకటించారు. ఇరు బోర్డుల పరస్పర అంగీకారంతో ఐదో టెస్టును నిలిపివేసినట్లు తెలిపారు. తొలుత ఈ మ్యాచ్‌ను నిర్వహించాలని ఇరు జట్లు భావించాయని, అయితే.. ఆటగాళ్ల భద్రత నేపథ్యంలో చర్చల అనంతరం రద్దు చేయడానికి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వివరించారు. అయితే, ఐదో టెస్టును త్వరలోనే మళ్లీ నిర్వహించేందుకు ఈసీబీ(ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు)తో కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు. ఈ కష్టసమయాల్లో తమ పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించినందుకు ఈసీబీకి జైషా ధన్యవాదాలు చెప్పాడు.
అయితే మ్యాచ్ రద్దవ్వడంపై అభిమానులు తీవ్ర అసహనానికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. అయితే ఈ క్రమంలోనే భారత్ జట్టు వాకోవర్ ఇచ్చిందంటూ ముందుగా ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుపై ఓ అభిమాని సెటైర్లు పేల్చాడు. ఇంగ్లండ్ గెలిచిన ప్రపంచకప్‌లో ఉపయోగించిన అసంబద్దమైన బౌండరీ కౌంట్ రూల్‌ను ఈ సిరీస్‌లో అమలు చేస్తే భారత్‌దే విజయమని ట్వీట్ చేశాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు భారత్ 245 బౌండరీలు బాదిందని, ఇంగ్లండ్ మాత్రం 233 బౌండరీలే కొట్టిందని పేర్కొన్నాడు. బౌండరీ కౌంట్ రూల్ అమలు చేస్తే భారత్‌దే సిరీస్ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
న్యూజిలాండ్‌తో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ అసంబద్దమైన బౌండరీ కౌంటీ నిబంధన ఆధారంగా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ నిబంధనను తొలగించారు.