ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్ట్‌లు ఆడని కోహ్లీ.. మూడు, నాలుగో టెస్ట్‌కు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ పేర్కొంది. చివరి మూడు టెస్ట్‌ల్లో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించాల్సి ఉంది.
మంగళవారమే భారత జట్టును ప్రకటిస్తారని ప్రచారం జరిగినా.. అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ టీమ్ ప్రకటనపై తాత్సారం చేస్తోంది. విరాట్ కోహ్లీ అందుబాటులోకి వచ్చే విషయంపై క్లారిటీ లేకపోవడంతో బీసీసీఐ జట్టును ప్రకటించడం లేదని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

ఇక తన సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో తొలి రెండు టెస్ట్‌లకు కోహ్లీ దూరంగా ఉన్నాడు. ప్రసవ సమయంలో ఆమె పక్కన ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాడు. బీసీసీఐ అనుమతితోనే ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అలాగే తన రెండో బిడ్డకు సంబంధించిన విషయాలను కోహ్లీ గోప్యంగా ఉంచాడు. ఎక్కడా కూడా ఈ విషయాన్ని ప్రకటించలేదు. అంతేకాకుండా అనుష్క శర్మ గర్భవతి అనే విషయం తెలియకుండా ఈ జోడీ చాలా జాగ్రత్తలు తీసుకుంది.
బీసీసీఐ సైతం వ్యక్తిగత కారణాలతోనే కోహ్లీ దూరమయ్యాడని ప్రకటించింది. దాంతో అనేక పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. కోహ్లీ తల్లి అనారోగ్యానికి గురైందనే కథనాలు వెలువడ్డాయి. చివరకు కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ ఈ వార్తలను ఖండించాడు. తన తల్లి సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని తెలిపాడు. కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడనే విషయాన్ని అతని సన్నిహితుడు, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అభిమానులకు తెలిపాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు.
అనుష్క శర్మ ప్రసవం పూర్తి కాకపోవడంతో కోహ్లీ తన లీవ్‌ను పొడిగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతను ఇంగ్లండ్‌తో మూడు, నాలుగో టెస్ట్‌కు దూరమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే.. ఆఖరి టెస్ట్‌కు కూడా దూరంగా ఉండి నేరుగా ఐపీఎల్‌లో బరిలోకి దిగే అవకాశం కూడా ఉందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.
తొలి రెండు టెస్ట్‌ల్లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలవగా.. మూడో టెస్ట్ రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుంది.