
బర్మింగ్‌హామ్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(11) మరోసారి నిరాశపరిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో భారీ అంచనాల నడుమ బ్యాటింగ్‌కు దిగిన కింగ్ కోహ్లీ.. ఇంగ్లండ్ యువ పేసర్ మ్యాటీ పోట్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతను వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను ఆడాలా? వద్దా అనే సంశయంతో గందరగోళానికి గురైన కోహ్లీ చివరకు మూల్యం చెల్లించుకున్నాడు.
ముందుగా ఆడుదామని బ్యాట్‌ను పొజిషన్‌కు తెచ్చిన కోహ్లీ.. మళ్లీ మనసు మార్చుకొని బ్యాట్‌ను వెనక్కు తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ వేగంగా దూసుకొచ్చి బంతి స్వింగ్ అయి ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకొని స్టంప్స్‌ను ఎగరగొట్టింది. ఈ ఊహించని పరిణామంతో షాక్‌కు గురైన కోహ్లీ నిరాశగా పెవిలియన్ బాట పట్టగా.. సగం మ్యాచ్ గెలిచామనే ఆనందంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. విరాట్ వికెట్‌తో టీమిండియా 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (11 బ్యాటింగ్), రిషభ్ పంత్(5 బ్యాటింగ్)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(17), చతేశ్వర్ పుజారా(13) శుభారంభం అందించలేదు. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరారు. ఆ తర్వాత క్రీజులోకి హనుమ విహారి, విరాట్ కోహ్లీ రాగా.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో అంపైర్లు ఆటను నిలిపేసి ముందుగా లంచ్ బ్రేక్ ప్రకటించారు. దాంతో భారత్ 20.1 ఓవర్లలో 53/2 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. వర్షం ఆగిపోయిన అనంతరం మ్యాచ్ ప్రారంభమవ్వగా.. ఆదిలోనే భారత్‌కు గట్టి షాక్ తగిలింది. మ్యాటీ పోట్స్ తన వరుస ఓవర్లలోనే భారత్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు. క్రీజులో సెట్ అయినట్లు కనిపించిన హనుమ విహారి(20)ని వికెట్ల ముందు బోల్తా కొట్టించిన మ్యాటీ.. ఆ మరుసటి ఓవర్‌లోనే విరాట్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
గతేడాది ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన ఈ మ్యాచ్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌ను ఇప్పుడు మళ్లీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ చివరి మ్యాచ్ గెలిచినా, డ్రా చేసుకున్నా.. సిరీస్ భారత్‌దే అవుతోంది.