దేశం తరఫున ఆడుతున్నప్పుడు బాధ్యత ఉండాలని టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ అన్నాడు. ఇంగ్లండ్‌తో మూడో టీ20 పరాజయం తీవ్ర నిరాశకు గురి చేసినా.. వీలైనంత త్వరగా ఈ ఫలితాన్ని మరిచిపోయి చివరి రెండు టీ20లపై ఫోకస్ పెట్టాలని సహచర ఆటగాళ్లకు సూచించాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-2తో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తీ(5/24) ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. దాంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడినా అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీ20ల్లో గెలుపు ఓటములు సహజమని అభిప్రాయపడ్డాడు.

'ఈ మ్యాచ్‌లో మేం విజయం సాధించలేకపోయాం. కానీ ఈ గేమ్‌లో గెలుపు ఓటములు సహజమే. వీలైనంత త్వరగా ఈ ఫలితాన్ని మరిచి తదుపరి మ్యాచ్ కోసం సిద్దమవ్వాలి. దేశం కోసం ఆడుతున్నప్పుడు బాధ్యతగా ఉండాలి. నేను నా బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాను. స్పెల్‌లో ఒక్క ఓవర్ వేయడంపై నేను ఎలాంటి ఫిర్యాదు చేయడం లేదు. ఎందుకంటే నేను ఒకే స్పెల్‌లో కూడా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన సందర్భాలున్నాయి. జట్టు కోసం ఎప్పుడైనా బౌలింగ్ చేసేందుక నేను రెడీ.
నా ఫ్లిప్పర్(బ్యాక్ స్పిన్)పై నేను ఫోకస్ పెట్టాను. అది అద్భుతంగా వస్తుంది. గత మ్యాచ్‌లో నేను చెప్పినట్లు నేను బౌలింగ్ చేసి ఉండవచ్చు. కానీ ఇంకా మెరుగ్గా బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను.'అని వరుణ్ చక్రవర్తీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. బెన్ డకెట్(28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. లియామ్ లివింగ్‌స్టోన్(24 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 43) ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(5/24) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. హార్దిక్ పాండ్యా(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసి ఓటమిపాలైంది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(35 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 40), అభిషేక్ శర్మ(14 బంతుల్లో 5 ఫోర్లతో 24) మినహా అంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ రెండేసి వికెట్లు తీయగా.. జామీ ఓవర్టన్ మూడు వికెట్లు పడగొట్టాడు. మార్క్ వుడ్‌కు ఓ వికెట్ దక్కింది.