టీ20 ఫార్మాట్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా పుణె వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ గెలుపుతో 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. సొంతగడ్డపై టీమిండియాకు ఇది వరుసగా 17వ టీ20 సిరీస్ విజయం కావడం గమనార్హం. వరుణ్ చక్రవర్తీ, హర్షిత్ రాణా సంచలన బౌలింగ్.. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే అసాధారణ బ్యాటింగ్ టీమిండియాను విజేతగా నిలబెట్టింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా( 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53), శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. రింకూ సింగ్(26 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30), అభిషేక్ శర్మ(19 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 29)పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహమూద్(3/35) మూడు వికెట్లు తీయగా.. జేమీ ఓవర్టన్(2/32) రెండు వికెట్లు పడగొట్టారు. బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. హ్యారీ బ్రూక్(26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. బెన్ డకెట్(19 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 39), ఫిల్ సాల్ట్(21 బంతుల్లో 4 ఫోర్లతో 23) శుభారంభం అందించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా(3/33), రవి బిష్ణోయ్(3/28) మూడేసి వికెట్లు తీయగా. వరుణ్ చక్రవర్తీ(2/28) రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్(1/35), అక్షర్ పటేల్(1/26) చెరో వికెట్ తీసుకున్నారు.
అదిరిపోయే ఆరంభం..
182 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ దూకుడుగా ఆడి తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. పవర్ ప్లేలో ఆఖరి బంతికి బెన్ డకెట్ ఔటయ్యాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే ఫిల్‌సాల్ట్‌ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కెప్టెన్ జోస్ బట్లర్‌ను రవి బిష్ణోయ్ క్యాచ్ ఔట్‌గా బోల్తా కొట్టించాడు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా శివమ్ దూబే స్థానంలో తుది జట్టులోకి వచ్చిన హర్షిత్ రాణా.. డేంజరస్ లివింగ్‌స్టోన్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.
మలుపు తిప్పిన వరుణ్, రాణా..
ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు హ్యారీ బ్రూక్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని జోరుకు వరుణ్ చక్రవర్తీ బ్రేక్ వేసాడు. స్టన్నింగ్ డెలివరీతో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. హ్యారీ బ్రూక్ వికెట్ అనంతరం ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. బ్రైడన్ కార్స్‌ను వరుణ్ చక్రవర్తీ ఔట్ చేయగా.. ఓవర్టన్‌ను హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు.
జోఫ్రా ఆర్చర్(0)ను రవి బిష్ణోయ్ ఔట్ చేయగా.. నిలకడగా ఆడిన జామీ ఓవర్టన్‌ను రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఖరి ఓవర్‌లో సకిబ్ మహమూద్‌ను అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేయడంతో భారత విజయం లాంఛనమైంది. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చిన హర్షిత్ రాణా మూడు కీలక వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.