IND vs ENG: వన్డే జట్టులోకి వరుణ్ చక్రవర్తీ!
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీకి ప్రమోషన్ దక్కినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో సంచలన బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన వరుణ్ చక్రవర్తీ 14 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన విషయం తెలిసిందే. అతని బౌలింగ్‌ను ఆడేందుకు ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడటంతో వన్డే జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమైంది. రవిచంద్రన్ అశ్విన్ వంటి మాజీ క్రికెటర్లు వరుణ్ చక్రవర్తీని ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడించాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే టీమిండియా మేనేజ్‌మెంట్ వరుణ్ చక్రవర్తీని భారత జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నాగ్‌పూర్ వేదికగా జరగనున్న తొలి వన్డేలో వరుణ్ చక్రవర్తీ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం వరుణ్ చక్రవర్తీ భారత వన్డే జట్టుతో నాగ్‌పూర్‌లోనే ఉన్నట్లు ఓ ప్రముఖ ఛానెల్ జర్నలిస్ట్ తెలిపాడు. అయితే అతన్ని జట్టులోకి తీసుకున్నారా? లేదా? అనేదానిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడించాలనే ఉద్దేశంతోనే వరుణ్ చక్రవర్తీని భారత వన్డే జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై బీసీసీఐతో పాటు టీమిండియా మేనేజ్‌మెంట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా వరుణ్ చక్రవర్తీ గురించి మాట్లాడిన అశ్విన్.. అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. వరుణ్ చక్రవర్తీని భారత వన్డే టీమ్‌లోకి తీసుకోవాలని సలహా ఇచ్చాడు. ఇప్పటి వరకు వన్డే క్రికెట్ ఆడని వరుణ్ చక్రవర్తీని ముందుగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడించాలన్నాడు. ఓ పేసర్‌ను తప్పించి మరీ వరుణ్ చక్రవర్తీని తీసుకోవాలని సెలెక్టర్లను కోరాడు.
'వరుణ్ చక్రవర్తి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉండాలా? వద్దా? అనేది మాట్లాడుకుందాం. వరుణ్ చక్రవర్తి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు అవకాశం ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ టోర్నీ బరిలో నిలిచే జట్లు ప్రొవిజనల్ టీమ్స్‌ను మాత్రమే ప్రకటించాయి. మార్పులు చేర్పులకు ఇంకా అవకాశం ఉంది. కాబట్టి వరుణ్ చక్రవర్తీని తీసుకునేందుకు ఛాన్స్ ఉంది. ఈ టోర్నీ కోసం ఎంపిక చేసిన భారత జట్టును గమనిస్తే.. ఒక పేసర్‌ను తప్పించి ఎక్స్‌ట్రా స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తీని తీసుకునే అవకాశం ఉంది. చక్రవర్తీ కోసం ఎవర్నీ తప్పించాలనేది నాకు తెలియదు. సెలెక్టర్లు ఏం చేస్తారో చూద్దాం.
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లోనూ వరుణ్ చక్రవర్తీని ఆడించాలి. అతన్ని నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడించడం అంత సులువైన పనికాదు. అతను ఇప్పటి వరకు వన్డే క్రికెట్ ఆడలేదు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇస్తారని అనుకుంటున్నా. ఈ సిరీస్‌లో ఆడించకుంటే అతను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికవ్వడం కష్టమే. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్న వరుణ్ చక్రవర్తీని అభినందిస్తున్నా. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో అతనే చక్రవర్తి. అతను మరింత ఎదగాలని కోరుకుంటున్నా.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications