ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. చెన్నై వేదికగా శనివారం జరిగిన రెండో టీ20లోనూ టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తెలుగు తేజం తిలక్ వర్మ ఒంటరి పోరాటంతో టీమిండియా విజయాన్నందుకుంది. ఓటమి తప్పదనుకున్న పరిస్థితుల్లో తిలక్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. మరోసారి కెప్టెన్ జోస్ బట్లర్(30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బ్రైడన్ కార్స్(17 బంతుల్లో ఫోర్లు, 3 సిక్స్‌లతో 31) విలువైన పరుగులు చేశాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మలకు తలో వికెట్ దక్కింది.

అనంతరం భారత్.. 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసి గెలుపొందింది. తిలక్ వర్మ(55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 72 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. వాషింగ్టన్ సుందర్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్(3/29) మూడు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, ఓవర్టన్, లివింగ్ స్టోన్ తలో వికెట్ తీసారు. తిలక్ వర్మ పోరాటాన్ని విరాట్ కోహ్లీ.. మెల్ బోర్న్‌లో ఆడిన ఐకానిక్ ఇన్నింగ్స్‌తో అభిమానులు పోలుస్తున్నారు.
శుభారంభం లేదు..
166 పరుగుల లక్ష్యచేధనకు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు సంజూ శాంసన్(5), అభిషేక్ శర్మ(12) వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. మార్క్ వుడ్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ వికెట్ల ముందు దొరికిపోగా.. సంజూ శాంసన్‌ను జోఫ్రా ఆర్చర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ భారీ సిక్స్‌లు బాదడంతో వేగంగా పరుగులు వచ్చాయి. మరో ఎండ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(12)ను బ్రైడన్ కార్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా 3 వికెట్లకు 59 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ధ్రువ్ జురెల్(4), హార్దిక్ పాండ్యా(7) తీవ్రంగా నిరాశపర్చారు. దాంతో భారత్ 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
తిలక్ వర్మ ఒంటరి పోరాటం..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌తో కలిసి తిలక్ వర్మ జట్టును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో అతను 38 బంతుల్లో 50 పరుగులు చేశాడు. సుందర్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ఆదిల్ రషీద్ నేలపాలు చేయగా.. అతను ఓ భారీ సిక్స్‌తో పాటు బౌండరీ బాదాడు. సుందర్(26)ను కార్స్ క్లీన్ బౌల్డ్ చేయగా.. అక్షర్ పటేల్(2)ను లివింగ్ స్టోన్ ఔట్ చేశాడు.
ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు తిలక్ వర్మ పోరాడాడు. భారీ షాట్ ఆడే క్రమంలో అర్ష్‌దీప్ సింగ్(6) కూడా ఔటవ్వగా.. రవి బిష్ణోయ్ సాయంతో తిలక్ వర్మ తన పోరాటాన్ని కొనసాగించాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. 19వ ఓవర్‌లో రవి బిష్ణోయ్ బౌండరీ బాదడంతో భారత్‌పై ఒత్తిడి తగ్గింది. చివరి ఓవర్‌లో భారత్ విజయానికి 6 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతికి క్విక్ డబుల్ తీసిన తిలక్ వర్మ.. బౌండరీ బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.