హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సలహాతోనే ఇంగ్లండ్‌తో రెండో టీ20లో జట్టును గెలిపించానని టీమిండియా యువ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ అన్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించిన విషయం తెలిసిందే.
ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తెలుగు తేజం తిలక్ వర్మ(55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 72 నాటౌట్) అసాధారణ ప్రదర్శనతో టీమిండియా విజయాన్నందుకుంది. 116 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును టెయిలెండర్ల సాయంతో తిలక్ వర్మ ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఈ అసాధారణ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిస్థితులకు తగ్గట్లు ఆడాలని గంభీర్ ఇచ్చిన సలహా తనకు ఉపయోగపడిందని తిలక్ వర్మ తెలిపాడు. 'వికెట్ కొంచెం టూ పేస్‌గా ఉంది. పేస్, బౌన్స్‌ను అంచనా వేయడం కష్టంగా మారింది. మరోవైపు వికెట్లు వరుసగా పడ్డాయి. దాంతో నేను గంభీర్ సర్ ఇచ్చిన సలహా మేరకు ఆడాను. వాస్తవానికి మ్యాచ్ ముందు రోజు నేను గంభీర్ సర్‌తో మాట్లాడాను. ఏం జరిగినా.. పరిస్థితులకు తగ్గట్లు ఆడాలని చెప్పాడు. జట్టుకు కావాల్సింది చేయాలన్నాడు. ఓవర్‌కు 10 పరుగులు అవసరమైతే.. అలానే ఆడాలని, కాస్త సోయితో బ్యాటింగ్ చేయాలని చెప్పాడు.
బ్యాటింగ్ చేయడానికి లెఫ్ట్-రైట్ కాంబినేషన్ మంచి ఆప్షన్. ఇది బౌలర్లకు కష్టతరం అవుతుంది. తరుచూ లైన్ అండ్ లెంగ్త్‌ను అడ్జస్ట్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. సౌతాఫ్రికాలోనే మేం షార్ట్ బాల్స్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. అయితే అక్కడి షార్ట్ బాల్స్ కంటే ఇక్కడి బౌన్స్‌ను ఆడటం కష్టం. మేం ముందుగానే సాధన చేశాం. ఆర్చర్, వుడ్ చాలా వేగంగా బౌలింగ్ చేశారు. అందుకు తగ్గట్లుగానే ప్రతీ ఒక్కరు సన్నదమయ్యారు. నెట్స్‌లో మేం తీవ్రంగా కష్టపడ్డాం. అదే మాకు ఫలితాన్నిచ్చింది. బిష్ణోయ్ రాగానే.. లైన్ ప్రకారం ఆడాలని, గ్యాప్‌లో షాట్ కొట్టాలని చెప్పాను. ఫాస్ట్ బౌలర్‌పై అతను ఆడిన ఫ్లిక్ షాట్.. లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో కొట్టిన బౌండరీతో లక్ష్య ఛేధన సులువైంది.'అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్(30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బ్రైడన్ కార్స్(17 బంతుల్లో ఫోర్లు, 3 సిక్స్‌లతో 31) విలువైన పరుగులు చేశాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మలకు తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్.. 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసి గెలుపొందింది. తిలక్ వర్మకు అండగా వాషింగ్టన్ సుందర్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్(3/29) మూడు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, ఓవర్టన్, లివింగ్ స్టోన్ తలో వికెట్ తీసారు.