SuryaKumar Yadav: నాలుగో టెస్ట్‌లో భారత్ గెలవాలంటే సూర్యకుమార్ ను తీసుకోవాల్సిందే!

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ గెలవాలంటే జట్టులో పలు మార్పులు చేయాల్సిందేనని మాజీ క్రికెటర్ దిలిప్ వెంగ్‌సర్కార్ సూచించాడు. యువ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి తీసుకొని బ్యాటింగ్ డెప్త్ పెంచాలన్నాడు. నలుగురు బౌలర్లు, ఆరుగురు బ్యాట్స్‌మన్ వ్యూహంతో బరిలో దిగితే మిగతా రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధిస్తుందని తెలిపాడు. ఆరో బ్యాట్స్‌మన్‌గా హనుమ విహారికి బదులు సూర్యకుమార్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకుంటే బ్యాటింగ్ లైనప్ బలంగా తయారవుతుందని సూచించాడు. నాలుగో టెస్టుకు అతడిని తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. రోహిత్, కోహ్లీలా స్పెషల్ టాలెంట్ ఉన్న ప్లేయర్ సూర్య అని, ఇప్పటికే అతను జట్టులోకి రావడం ఆలస్యమైందన్నాడు.

సూర్యకు చాన్స్ ఇవ్వాలి..
శనివారం ముగిసిన మూడో టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీటీఐతో మాట్లాడిన వెంగ్ సర్కార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'బ్యాటింగ్ లైనప్ బలంగా తయారవ్వాలంటే జట్టులోకి హనుమ విహారిని తీసుకోవాలని అంటున్నారు. కానీ అతనికి బదులు సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకుంటే మంచిది. చెప్పడానికి కాస్త కష్టంగా ఉన్నా దీన్ని నేను బలంగా నమ్ముతున్నా. టీమిండియాలోని అద్భుత ఆటగాళ్లతో సమానంగా సూర్యలోనూ నైపుణ్యాలు ఉన్నాయి.
అతను ప్రతిభ ఉన్న ఆటగాడు. ఇప్పటికే జట్టులోకి అతన్ని తీసుకోవడం చాలా ఆలస్యమైంది. ఇక తుది జట్టులో అశ్విన్‌ను ఎందుకు తీసుకోలేదో ఇప్పటికీ నాకు మిస్టరీగానే ఉంది. అతనికి అవకాశమివ్వకపోవడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఏదేమైనప్పటికీ మిగతా మ్యాచ్‌లు గెలవాలంటే టీమిండియా నలుగురు బౌలర్లు, ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో బరిలో దిగాలి'అని వెంగ్ సర్కార్ సూచించాడు.

ఎక్స్ ట్రా బ్యాట్స్‌మన్ అవసరం..
ఆరుగురు బ్యాట్స్‌మెన్ సూత్రాన్నిఅమలు చేయడం మంచిదని ఇటీవల దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ కూడా సూచించాడు. హనుమ విహారీని జట్టులోకి తీసుకోవాలని చెప్పాడు. ఇక మూడో టెస్ట్‌లో భారత్ ఓటమికి ప్రధానకారణం ఆఫ్ స్టంప్ లైన్ బాల్స్ ఆడలేకపోవడమేనన్నాడు. ఆఫ్ స్టంప్‌కు బయటగా... నాలుగు, ఐదో స్టంప్ లైన్‌లో ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో భారత బ్యాట్స్‌మెన్ వికెట్లు సమర్పించుకున్నారని తెలిపాడు. కీపర్ క్యాచ్ లేదా స్లిప్ దొరికపోవడం చేసి పెవిలియన్ బాట పట్టారని ఇదే భారత ఓటమిని శాసించిందన్నాడు. ముఖ్యంగా కోహ్లీ, రహానే, పుజారా తీవ్రంగా ఇబ్బందిపడ్డారని తెలిపాడు.

63 రన్స్ వ్యవధిలోనే..
ఓవర్‌నైట్ స్కోరు 215/2తో నాలుగో రోజు శనివారం ఆట కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 99.3 ఓవర్లలో 278 పరుగుల వద్ద ఆలౌటైంది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రాబిన్సన్ (5/65), ఓవర్టన్ (3/47) భారత్ ఇన్నింగ్స్‌ను కూల్చేశారు. చేతిలో 8 వికెట్లున్న భారత్ నాలుగో రోజు ఉదయం సెషన్‌లో ఇరవై ఓవర్లయినా పూర్తిగా ఆడలేకపోయింది. ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం 63 పరుగులు జతచేసి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 78 పరుగులకే ఆలౌటవ్వగా.. ఇంగ్లండ్ 432 పరుగులు చేసింది. సెప్టెంబర్ 2 నుంచి ఓవల్‌లో నాలుగో టెస్టు జరుగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications