వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడంతో పాటు గాయంతో ఆటకు దూరమవ్వడం సర్ఫరాజ్ ఖాన్ వేటుకు కారణమైందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇది కఠిన నిర్ణయమేనని అభిప్రాయపడిన సునీల్ గవాస్కర్.. కరుణ్ నాయర్ సెలెక్షన్‌ను మెచ్చుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. 18 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో కరుణ్ నాయర్‌కు అవకాశం దక్కగా.. సర్ఫరాజ్ ఖాన్ చోటు కోల్పోయాడు.
కరుణ్ ఎంపిక సరైనదే..
టీమ్ సెలెక్షన్‌పై ఇండియా టుడేతో మాట్లాడిన గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో కరుణ్ నాయర్ నిలకడగా రాణించడంతోనే సెలెక్టర్లు ఎంపిక చేశారని చెప్పాడు. 'జయదేవ్ ఉనాద్కత్ కూడా చాలా చిన్న వయసులోనే తొలి టెస్ట్ ఆడాడు. రెండో టెస్ట్ ఆడేందుకు అతనికి 13 ఏళ్ల సమయం పట్టింది. అయినా అతను పట్టు వదలకుండా దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా వికెట్లు తీసాడు. ఉనాద్కత్‌లానే కరుణ్ నాయర్ కూడా నిలకడగా రాణిస్తూ 8 ఏళ్ల తర్వాత అవకాశం అందుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో శతకాలు నమోదు చేయడంతోనే సెలెక్టర్లు కరుణ్ నాయర్‌కు అవకాశం కల్పించారు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడటం కూడా కరుణ్ నాయర్‌కు కలిసొచ్చింది. కరుణ్ నాయర్ ఎంపిక చాలా మంచి నిర్ణయం.

పాపం సర్ఫరాజ్ ఖాన్..
అయితే సర్ఫరాజ్ ఖాన్‌పై వేటు వేయడం మాత్రం కఠినమైన నిర్ణయమనే చెప్పాలి. క్రికెట్ అంటేనే ఇది. అవకాశాలు వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోని జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి. ఓ మ్యాచ్‌లో సెంచరీ చేసినా.. తదుపరి మ్యాచ్‌కు ఫ్రెష్‌గా బరిలోకి దిగాలి. గత మ్యాచ్‌లో సెంచరీ చేసానులే అనే ఆలోచనతో ఉండకూడదు. జట్టు నుంచి వేటు వేసేలా ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. అయితే ఆస్ట్రేలియా పర్యటన తర్వాత సర్ఫరాజ్ ఖాన్ ఎక్కువగా రెడ్ బాల్ క్రికెట్ ఆడలేదు. గాయంతో రంజీ ట్రోఫీకి దూరమయ్యాడు. దాంతో ఫామ్ ఎంటో చూపించుకునే అవకాశం అతనికి లేకుండా పోయింది.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్( వికెట్ కీపర్,వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్, ఆకాశ్ దీప్, కుల్‌దీప్ యాదవ్.