టీమిండియా యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ను దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పోల్చడం సరికాదని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. అప్పుడే అతన్ని ధోనీతో పోల్చి అనవసర ఒత్తిడికి గురి చేయవద్దని గంగూలీ సూచించాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ధ్రువ్ జురెల్.. తన ఫస్ట్ మ్యాచ్‌లోనే 46 పరుగులతో ఆకట్టుకున్నాడు.
రెండో మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో క్లిష్ట పరిస్థితుల్లో 90 పరుగులు చేసిన ధ్రువ్ జురెల్.. రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులతో అజేయంగా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ధ్రువ్ జురెల్ అసాధారణ ప్రదర్శనపై సర్వత్ర ప్రశంసల జల్లు కురిసింది.

దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అయితే అతన్ని ధోనీతో పోలుస్తూ ఆకాశానికెత్తాడు. తాజాగా ధ్రువ్ జురెల్ ఆట తీరుపై స్పందించిన సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మహేంద్ర సింగ్ ధోనీ చాలా భిన్నమైన ఆటగాడు. దిగ్గజ ప్లేయర్ అయిన అతనితో ధ్రువ్ జురెల్‌ను పోల్చడం సరికాదు. జురెల్ నైపుణ్యం విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు.
కానీ ఇంత త్వరగా ధోనీతో పోల్చడం మాత్రం సరికాదు. అతడికి కాస్త స్వేచ్చగా ఆడే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడే ధోనీలాంటి ఆటగాడితో పోల్చి అనవసర ఒత్తిడికి గురి చేయవద్దు. 20 ఏళ్లు కష్టపడితే ధోనీకి ఆ పేరు వచ్చింది. ఏదేమైనా జురెల్ స్పిన్, పేస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అన్నింటికి మించి ఒత్తిడిలో అద్భుతంగా ఆడాడు. అది అతని ప్రతిభకు నిదర్శనం'అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

ఇక డబుల్ సెంచరీలతో చెలరేగిన యశస్వి జైస్వాల్.. మూడు ఫార్మాట్లలో సత్తా చాటే ఆటగాడని కొనియాడాడు. ఇక ఈ సిరీస్‌లో టీమిండియా పుంజుకుంటుందని తాను ముందే ఊహించానని దాదా చెప్పుకొచ్చాడు.
'హైదరాబాద్ టెస్ట్ పరాజయం తర్వాత భారత్ పుంజుకుంటుందని ముందే ఊహించా. సొంతగడ్డపై టీమిండియా ఓడించడం చాలా కష్టం. పైగా ఇంగ్లండ్ చాలా యంగ్ టీమ్. ముఖ్యంగా వారి స్పిన్ బౌలింగ్ అటాక్‌కు అంతగా అనుభవం లేదు. ముగ్గురు స్పిన్నర్లు ఈ సిరీస్ కంటే ముందు ఒకే ఒక్క మ్యాచ్ ఆడారు. బషీర్ ఈ సిరీస్‌లోనే అరంగేట్రం చేశాడు. ఇలాంటి అనుభవం లేని స్పిన్ అటాక్ కలిగిన జట్లను అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా చూడం.'అని దాదా తెలిపాడు.