IND vs ENG: ఇంగ్లండ్ మహిళల జట్టుతో మూడు టీ20ల సిరీస్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు విజయంతో ముగించింది. సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తయిన హర్మన్ సేన.. నామమాత్రపు ఆఖరి పోరులో విజయం సాధించి పరువు దక్కించుకుంది. ఆదివారం ముంబై వేదికగా జరిగిన ఈ లోస్కోరింగ్ థ్రిల్లర్.. భారత అమ్మాయిలు సమష్టిగా రాణించి 5 వికెట్ల తేడాతో గెలుపొందారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హీథర్ నైట్(42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) ఒక్కతే హాఫ్ సెంచరీతో రాణించగా.. అమీ జోన్స్(21 బంతుల్లో 3 ఫోర్లతో 25)ఆమెకు అండగా నిలిచింది. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

భారత బౌలర్లలో సైకా ఇషాక్(3/22), శ్రేయాంక పాటిల్(3/19) మూడేసి వికెట్లతో తీన్మార్ వేయగా.. అమన్‌జో కౌర్, రేణుక సింగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత్.. 19 ఓవర్లలో 5 వికెట్లకు 130 పరుగులు చేసి గెలుపొందింది. స్మృతి మంధాన(48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. జెమీమా రోడ్రిగ్స్(33 బంతుల్లో 4 ఫోర్లతో 29) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెయ కెంప్, సోఫీ ఎక్లెస్టోన్ రెండేసి వికెట్లు తీయగా.. చార్లీ డెన్ ఓ వికెట్ పడగొట్టింది.
స్వల్ప లక్ష్య చేధనలో షెఫాలీ వర్మ(6) విఫలమైనా.. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ జట్టును ఆదుకున్నారు. ఆచితూచి ఆడి విజయానికి బాటలు వేసారు. దాంతో దీప్తి శర్మ(12), రిచా ఘోష్(2) విఫలమైనా.. అమన్‌జోత్ కౌర్(13 నాటౌట్), హర్మన్ ప్రీత్ కౌర్(6 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.