Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: మలుపు తిప్పిన శ్రేయస్ అయ్యర్.. టీమిండియా ఘన విజయం!

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా గురువారం జరిగిన తొలి వన్డేలో సమష్టిగా రాణించిన భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. బౌలింగ్‌లో హర్షిత్ రాణా, జడేజా సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ రాణించారు.

రఫ్ఫాడించిన జడేజా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(67 బంతుల్లో 4 ఫోర్లతో 52), జాకోబ్ బెతెల్(64 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/26), అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా(3/53) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.

IND vs ENG Shreyas Iyer and Shubman Gill s Fifties Help India Beat England in 1st ODI

అనంతరం భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. శుభ్‌మన్ గిల్(96 బంతుల్లో 14 ఫోర్లతో 87 ), అక్షర్ పటేల్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52 ) శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహ్మూద్(2/47), ఆదిల్ రషీద్(2/49) రెండేసి వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, జాకోబ్ బెతెల్ తలో వికెట్ పడగొట్టారు.

సూపర్ ఫీల్డింగ్‌తో ఫిల్ సాల్ట్‌ను రనౌట్ చేసిన శ్రేయస్ అయ్యర్.. బ్యాటింగ్‌లో రెండు కీలక వికెట్లు కోల్పోయిన తర్వాత దూకుడుగా ఆడి మ్యాచ్‌ను భారత్‌వైపు మలుపు తిప్పాడు. ఇంగ్లండ్ పేలవ ఫీల్డింగ్ కూడా భారత్‌కు కలిసొచ్చింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఆదివారం కటక్ వేదికగా జరగనుంది.

నిరాశపర్చిన రోహిత్, జైస్వాల్..

స్వల్ప లక్ష్యచేధనకు దిగిన భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(15), రోహిత్ శర్మ(2) తీవ్రంగా నిరాశపరిచారు. ఆర్చర్ బౌలింగ్‌లో తీవ్రంగా తడబడ్డ యశస్వి జైస్వాల్.. కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ అనవసర షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. దాంతో భారత్ 19 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడాడు. గిల్ ఆచితూచి ఆడినా.. అయ్యర్ బౌండరీలతో చెలరేగాడు. దాంతో భారత్ పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది.

చెలరేగిన అయ్యర్, గిల్
అనంతరం అదే జోరు కొనసాగించిన అయ్యర్ 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ కూడా బ్యాట్ ఝులిపించడంతో భారత్ 14 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసుకుంది. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జాకోబ్ బెతెల్ విడదీసాడు. అయ్యర్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 94 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయ్యర్ ఔటైనా.. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో అతను 60 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అక్షర్ పటేల్ సైతం..
మరోవైపు అక్షర్ పటేల్ తనదైన షాట్లతో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 46 బంతుల్లో అతను కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ విజయం లాంఛనమే అన్న పరిస్థితుల్లో అక్షర్ పటేల్‌‌ను ఆదిల్ రషీద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 108 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(2) తీవ్రంగా నిరాశపరిచాడు. ఆదిల్ రషీద్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సెంచరీ చేయాలనే ఆలోచనతో దూకుడుగా ఆడిన శుభ్‌మన్ గిల్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా(9నాటౌట్)తో కలిసి జడేజా(12 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Thursday, February 6, 2025, 20:43 [IST]
Other articles published on Feb 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+