1982 రికార్డు బ్రేక్..
ఇప్పటి వరకు ఇంగ్లండ్ గడ్డపై 9వ వికెట్‌కు కపిల్ దేవ్-మదన్ లాల్ నెలకొల్పిన 66 పరుగుల భాగస్వామ్యమే రికార్డుగా ఉంది. 1982లో లార్డ్స్ వేదికగానే జరిగిన మ్యాచ్‌లో భారత దిగ్గజాలు ఈ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజాగా బుమ్రా-షమీ ఇన్నింగ్స్‌తో ఆ రికార్డు బద్దలైంది. ఈ జాబితాలో హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ జోడీ 61 పరుగులతో మూడో స్థానంలో ఉంది. 2002 నాటింగ్ హోమ్ టెస్ట్‌లో ఈ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత 1986 లీడ్స్ టెస్ట్‌లో రోజర్ బిన్నీ-వెంగ్ సర్కార్(60), రాహుల్ ద్రవిడ్ -వెంకటేశ్ ప్రసాద్(60) 1996 నాటింగ్ హోమ్ టెస్ట్, జీ రామ్ చంద్, షిండే(54)- 1986 లార్డ్స్ టెస్ట్ ఉన్నారు. 2014 నాటింగ్ హోమ్ టెస్ట్‌లో భువనేశ్వర్ కుమార్-ఇషాంత్ శర్మ 47 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

చిత్తవుతుందనుకుంటే..
అంతకుముందు 181/6 ఓవర్ నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను కొనసాగించిన భారత్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఓటమి నుంచి జట్టును గట్టెక్కిస్తాడనుకున్న రిషభ్ పంత్(22) తీవ్రంగా నిరాశపరిచాడు. బౌండరీతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన పంత్.. రాబిన్సన్ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేయబోయి ఎక్స్‌ట్రా బౌన్స్ కారణంగా కీపర్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 194 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి మహమ్మద్ షమీ(4 బ్యాటింగ్) రాగా.. ఇషాంత్ శర్మ(12 బ్యాటింగ్) ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశాడు. రెండు బౌండరీలతో జోరు కనబర్చాడు. కానీ ఓలీ రాబిన్సన్ ఇషాంత్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. రివ్యూ తీసుకున్న ఫలితం లేకుండా పోయింది. దాంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనని అంతా భావించారు. కానీ బుమ్రా-షమీ అద్భుతంగా పోరాడారు.

సెహ్వాగ్ స్టైల్‌లో..
ఇంగ్లండ్ బౌలర్లు రాకాసి బౌన్సర్లతో ఎదురుదాడికి దిగినా.. ధీటుగా బదులిచ్చారు. టాపార్డర్ బ్యాట్స్‌మన్ తరహాలో స్వేచ్చగా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి సహనాన్ని పరీక్షించారు. ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ బౌలర్లు మార్చినా.. ఫీల్డి సెటప్ జరిపినా.. వ్యూహం మార్చినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో 58 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో షమీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మోయిన్ అలీ వేసిన 106 ఓవర్ తొలి బంతిని బౌండరీ తరలించిన షమీ.. ఆ మరుసటి బంతిని భారీ సిక్సర్‌గా మలిచి మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షమీ హాఫ్ సెంచరీ పూర్తైన వెంటనే లార్డ్స్ బాల్కనీలోని భారత ఆటగాళ్లు స్టాండింగ్ ఓవేషన్‌తో అభినందనలు తెలిపారు.
షమీకి ఇది కెరీర్‌లో రెండో హాఫ్ సెంచరీకాగా.. ఈ రెండు ఇంగ్లండ్ గడ్డపైనే సాధించడం గమనార్హం. 2014 పర్యటనలో షమీ మొదటి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. షమీ-బుమ్రా క్రీజులో అజేయంగా నిలవడంతో లంచ్ బ్రేక్ సమాయనికి భారత్ 108 ఓవర్లలో 8 వికెట్లకు 286 రన్స్ చేసింది. ఆ తర్వాత ఈ జోడీ 12 పరుగులు జోడించగానే భారత కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌గా ప్రకటించాడు.

క్రికెట్ చరిత్రలోనే తొలిసారి..
ఇక 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి ఓవర్‌లోనే గట్టిషాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ రోరీ బర్న్స్(0)ను బుమ్రా డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫార్వార్డ్ ఫీల్డర్ సిరాజ్ చేతిలో పడింది. షమీ వేసిన మరుసటి ఓవర్‌లో మరో ఓపెనర్ డామ్ సిబ్లీ(0) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇండియాపై ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరూ ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరారు. ఆ తర్వాత షమీ బౌలింగ్‌లో హసీబ్ అహ్మద్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను స్లిప్‌లో రోహిత్ శర్మ నేలపాలు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ డ్రా కోసం పోరాడుతోంది.


Click it and Unblock the Notifications












