ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గౌతమ్ గంభీర్ కారణంగానే సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం దక్కలేదనిపిస్తోందని పరోక్షంగా వెల్లడించాడు. రోహిత్ శర్మ లేకపోవడంతో ఆటగాళ్లపై టీమిండియా మేనేజ్‌మెంట్ ఓ అంచనాకు వచ్చి ఎంపిక చేసినట్లు అర్థమవుతుందన్నాడు. సర్ఫరాజ్ ఖాన్ విదేశాల్లో రాణించలేడని భావించి అతన్ని పక్కనపెట్టారని ఆరోపించాడు.
ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌తో డబ్ల్యూటీసీ 2027 ఎడిషన్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఇటీవలె భారత సెలెక్టర్లు ప్రకటించారు. ఈ జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు దక్కలేదు. కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్‌లకు అవకాశం దక్కింది. అయితే కరుణ్ నాయర్ కంటే సర్ఫరాజ్ ఖాన్‌కే మెరుగైన రికార్డ్ ఉంది.

మెరుగైన రికార్డ్ ఉన్నా..
సొంతగడ్డపై సర్ఫరాజ్ ఖాన్ 4 టెస్ట్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలతో పాటు ఓ శతకం సాధించాడు. ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో అతను విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతనికి అవకాశం రాలేదు. గాయంతో జట్టుకు దూరమైన సర్ఫరాజ్ ఖాన్.. దేశవాళీ క్రికెట్ కూడా ఆడలేదు. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన సర్ఫరాజ్ ఖాన్ దాదాపు 10 కిలోల బరువు తగ్గి ఇంగ్లండ్ పర్యటన కోసం సిద్దమవుతున్నాడు. భారత్-ఏ జట్టు తరఫున అవకాశం అందుకున్న అతను.. సీనియర్ టీమ్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.
విదేశాల్లో ఆడలేడనే..
సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై స్పందించిన సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'సర్ఫరాజ్ ఖాన్ స్వదేశంలో నాలుగు టెస్టుల్లో మూడు అర్ధసెంచరీలు, ఒక సెంచరీ(150) చేశాడు. ఆ తర్వాతి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సర్ఫరాజ్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అయితే టీమిండియా మేనేజ్‌మెంట్‌లోని ముఖ్యమైన వ్యక్తి సర్ఫరాజ్ ఖాన్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో పరుగులు చేయలేడని, కరుణ్ నాయర్ చేస్తాడని భావించి ఉంటాడు. దాంతోనే కరుణ్ నాయర్ కంటే మెరుగైన రికార్డ్ ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌ను పక్కనపెట్టారు.
వ్యక్తిగత అభిప్రాయాలతో..
రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో గంభీర్.. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలను అంచనా వేసి జట్టును ఎంపిక చేసినట్లు అనిపిస్తోంది. పరిస్థితులు, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను బట్టి జట్టు ఎంపిక విషయంలో వారి సొంత అభిప్రాయాన్ని వర్తింపజేసినట్లు అనిపిస్తోంది.'అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.