
మరో కోణాన్ని చూపించాడు
తాజాగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ జట్టును ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నాడు. అతడి ఆట తీరును చూస్తే అలాగే అనిపించింది. ఎందుకంటే రోహిత్ పరిస్థితులకు తగినట్టు తన ఆటను మార్చుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో తనలో మరో కోణాన్ని చూపించాడు' అని అన్నాడు. రెండో టెస్టులో రోహిత్ అద్భుతంగా ఆడాడు.
పిచ్ పేస్ బౌలర్లకు సహకరిస్తున్నా.. ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొని క్రీజులో నిలబడ్డాడు. కేఎల్ రాహుల్‌కు అండగా నిలబడి జట్టుకు శుభారంభం అందించాడు. రెండో టెస్టులో రోహిత్-రాహుల్ జోడి 126 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దీంతో 69 ఏళ్ల తర్వాత లార్డ్స్ మైదానంలో టెస్టు మ్యాచ్‌లో వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పిన టీమిండియా ఓపెనింగ్ జోడిగా నిలిచింది.

నాయకుడిగా ఉన్నాడు
రోహిత్ శర్మ పుల్‌షాట్ల బలహీనతపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. అతడు ఔటైన విధానం కాకుండా జట్టుకు ఏం చేశాడన్నదే గమనించానని తెలిపాడు. 'భారత బ్యాటింగ్ లైనప్‌కు రోహిత్ శర్మ నాయకుడిగా ఉన్నాడు. కేఎల్ రాహుల్ అతడికి బాగా మద్దతిచ్చాడు. నిజానికి రోహిత్ పుల్ షాట్లను అద్భుతంగా ఆడగలడు. ఆ షాట్లతో బంతిని అలవోకగా స్టేడియం దాటించగలడు. అతడెలా ఔటయ్యాడన్నది కాకుండా.. ఈ రెండు టెస్టుల్లో అతడు జట్టుకేం చేశాడన్నదే నేను చూస్తున్నాను. జట్టుకు విలువైన పరుగులు అందించేందుకు రోహిత్ తన సహకారం అందిస్తున్నాడు' అని మాస్టర్ బ్లాస్టర్ పేర్కొన్నాడు.
IPL 2021: యూఏఈలో ప్రాక్టీస్ ఆరంభించిన చెన్నై.. అదిరిపోయే లుక్‌లో ఎంఎస్ ధోనీ!!

ఎంతో సహనం పెరిగింది
'రోహిత్ శర్మలో ఎంతో సహనం పెరిగింది. ఓపికతో ఆడుతున్నాడు. నిజానికి అతడు బంతుల్ని చక్కగా వదిలేస్తున్నాడు. అవసరమైన బంతిని అద్భుతంగా డిఫెండ్ చేస్తున్నాడు. అతడో గొప్ప ఆటగాడు. ఇంగ్లండ్‌లో రోహిత్ ఇన్నింగ్సులు చూసిన తర్వాత అతడి ఆట మరో స్థాయిని చేరుకుందని కచ్చితంగా చెప్పగలను. హిట్‌మ్యాన్ ఆటను నేను ఎంతో ఆస్వాదిస్తున్నా. మిగతా టెస్టులో కూడా రోహిత్ అలరిస్తాడని నమ్ముతున్నా' అని సచిన్ టెండూల్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ ఇంగ్లండ్‌పై రెండు టెస్టుల్లో 36, 12 నాటౌట్, 83, 21 పరుగులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

69 ఏళ్ల రికార్డు బ్రేక్
1952లో క్రికెట్ పుట్టినిళ్లు లార్డ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ తరఫున చివరిసారిగా వినోద్ మన్కడ్-పంకజ్ రాయ్‌ల జోడి వందకు పైగా పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వినోద్-పంకజ్‌లు 106 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 69 ఏళ్ల పాటు వారిపై ఉన్న ఆ రికార్డు తాజాగా బ్రేక్ అయింది. రెండో టెస్ట్ రెండో సెషన్లో రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్‌ల జోడి వారిని అధిగమించారు. రోహిత్-రాహుల్‌లు 126 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఆ రికార్డు బ్రేక్ అయింది.


Click it and Unblock the Notifications
