
లండన్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డే సందర్భంగా పెను ప్రమాదం తప్పింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన భారీ సిక్సర్‌కు ఓ చిన్నారి గాయపడింది. ఈ అనూహ్య పరిణామంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు, కామెంటేటర్లు ఆందోళనకు గురయ్యారు. కొద్ది క్షణాలు మ్యాచ్ ఆపేసి చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసారు. అయితే సదరు చిన్నారి క్షేమంగానే ఉందని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..? భారత ఇన్నింగ్స్ సందర్భంగా డేవిడ్ విల్లే వేసిన 5వ ఓవర్‌లో రోహిత్ తనదైన పుల్ షాట్‌తో భారీ సిక్సర్ బాదాడు. స్టాండ్స్‌లో ఉన్న జనంవైపు దూసుకెళ్లిన బంతి మ్యాచ్ చూసేందుకు తన తండ్రితో వచ్చిన చిన్నారికి బలంగా తాకింది. దాంతో ఆమె నొప్పితో విలవిలలాడింది. ఆమెకు ఎలాంగా గాయాలు కాలేదని తెలుసుకున్న తర్వాత మ్యాచ్‌ను పున ప్రారంభించారు. ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్.. చిన్నారికి తగలకుండా బంతిని పట్టుకోకుండా ఏం చేస్తున్నారని ప్రేక్షకులను తన సైగలతో నిలదీయడం వీడియోలో కనిపించింది. ఇక ఈ ఊహించని పరిణామంతో కామెంటేటర్లు రవిశాస్త్రి మైకేల్ అథర్టన్ ఆందోళనకు గురయ్యారు.
'రోహిత్ బాదిన ఈ సిక్స్ కాస్త ప్రేక్షకుల్లో ఎవరినో గాయపరిచినట్లుంది. ఎవరిని నొప్పించకుండా ఉండాలని ఆశిద్దాం'అని అథర్టన్ అనగా.. 'అవును అక్కడ ఎవరికో గాయం అయినట్లు ఉంది. రోహిత్ సైతం అటువైపే చూస్తున్నాడు.'అని శాస్త్రి పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' జస్‌ప్రీత్ బుమ్రా (6/19) సంచలన బౌలింగ్‌కు, మహ్మద్ షమీ (3/31) మెరుపులు కూడా తోడవడంతో మొదట ఇంగ్లాండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జోస్ బట్లర్ (30; 32 బంతుల్లో 6×4) టాప్‌స్కోరర్. అనంతరం కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ (76 నాటౌట్; 58 బంతుల్లో 7×4, 5×6) చెలరేగడం.. మరో ఓపెనర్ ధావన్ (31 నాటౌట్; 54 బంతుల్లో 4×4) కూడా నిలకడగా ఆడడంతో భారత్ 18.4 ఓవర్లలో ఒక్క వికెట్టూ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. భారత పేసర్లు విజృంభించిన పిచ్ మీద ఇంగ్లిష్ బౌలర్లను అసలేమాత్రం లెక్క చేయలేదు రోహిత్.