ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ తెలిపాడు. టాస్ గెలిచిన అనంతరం మాట్లాడుతూ.. సిరీస్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో ముందుగా బ్యాటింగ్ చేయడమే ఉత్తమమని తమ మేనేజ్‌మెంట్ భావించిందని స్టోక్స్ పేర్కొన్నాడు.
'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. సిరీస్‌లో 2-1తో వెనుకంజలో నిలిచాం. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్ మాకు కీలకం. ప్రతీ మ్యాచ్ ముఖ్యమే కానీ ఈ విజయం అతి కీలకం. తొలి గంట ఆట తర్వాత పిచ్‌పై మాకు ఓ అవగాహన రానుంది. పిచ్ ఎలా ఉండబోతుందో అనేదానిపై క్లారిటీ వస్తుంది.

అయితే ఈ పిచ్‌పై ముందుగా బ్యాటింగ్ చేయడమే ఉత్తమం. ఈ సిరీస్‌లో మా ప్రదర్శనపై సంతోషంగా ఉంది. అదే తరహా అప్రోచ్‌తో కొనసాగుతాం.'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు. మరోవైపు టాస్ గెలిస్తే తాను కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాడినని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. పిచ్ కొంచెం డ్రైగా ఉండటంతో పాటు క్రాక్స్ ఉన్నాయని చెప్పాడు.
ఈ పిచ్ సహజ స్వభావమే అదన్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో తమ జట్టు అద్భుతంగా రాణించిందని, ముఖ్యంగా కుర్రాళ్లు సత్తా చాటారని కొనియాడాడు. తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారని చెప్పాడు. వారి నైపుణ్యాలపై కుర్రాళ్లంతా ఆత్మవిశ్వాసంతో ఉన్నారని తెలిపాడు. అదే జోరును ఈ మ్యాచ్‌లో కూడా కొనసాగిస్తామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
తుది జట్టులో ఏకైక మార్పు చేశామని చెప్పిన రోహిత్.. బుమ్రా స్థానంలో ఆకాశ్ దీప్ అరంగేట్రం చేస్తున్నాడని తెలిపాడు. సమర్థవంతంగా రివర్స్ స్వింగ్ చేయగడంతో పాటు బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగలడనే ఆకాశ్‌దీప్‌కు అవకాశం ఇచ్చినట్లు చెప్పాడు.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో హైదరాబాద్ టెస్ట్ ఓడిన ఇంగ్లండ్.. వైజాగ్, రాజ్‌కోట్‌లో భారీ విజయాలు అందుకొని 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఇదే జోరులో రాంచీ టెస్ట్‌లో కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలనుకుంటోంది.
తుది జట్లు:
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డక్కెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్, టామ్ హార్ట్‌లీ, ఓలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్.