IND vs ENG: అంపైర్ల తొండాట.. అది అంపైర్స్ కాల్ ఎలా అవుతుంది? రోహిత్ శర్మ ఎల్బీపై ఫ్యాన్స్ ఫైర్!

లీడ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా దీటుగా ఆడుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలి పరువు తీసుకున్న కోహ్లీసేన.. రెండో ఇన్నింగ్స్‌లో స్పూర్తిదాయక పోరాటం చేస్తోంది. ఓపెనర్ రోహిత్ శర్మ (156 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 59) రాణించగా, చతేశ్వర్ పుజారా (180 బంతుల్లో 15 ఫోర్లతో 91 బ్యాటింగ్) సెంచరీకి చేరువయ్యాడు. కెప్టెన్ కోహ్లీ (94 బంతుల్లో 6 ఫోర్లతో 45 బ్యాటింగ్) క్రీజులో పాతుకుపోయాడు.
80 ఓవర్లు అంటే దాదాపు రోజంతా (సాధారణంగా 90 ఓవర్లు) బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం రెండే వికెట్లు సమర్పించుకుంది. మూడో రోజు ఆట నిలిచే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 215 పరుగులు చేసింది. రాబిన్సన్, ఓవర్టన్‌లకు చెరో వికెట్ దక్కింది. అయితే రోహిత్ శర్మ ఔటైన తీరుపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంపైర్లపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు అంపైర్స్ కాల్ అనే నిబంధన ఎంత గందరగోళంగా ఉందో రోహిత్ ఔటైన తీరే నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు. ఈ తప్పుడు నిర్ణయం భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని మండిపడుతున్నారు.
అసలేం జరిగిందంటే..?
భారత ఇన్నింగ్స్ సందర్భంగా ఓలీ రాబిన్సన్ వేసిన 48 ఓవర్ నాలుగో బంతిని రోహిత్ శర్మ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతని అంచనా తప్పడంతో బంతి బ్యాట్‌ను మిస్సై రోహిత్ ఫ్రంట్ ప్యాడ్‌కు తగిలింది. వెంటనే ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో ఔటిచ్చాడు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రోహిత్ వెంటనే రివ్యూ తీసుకున్నాడు. ఇక రిప్లేలో బంతి లెగ్ స్టంప్‌ను కొంచెం తాకుతూ వెళ్తున్నట్లుగా కనిపించింది. దాంతో టీవీ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ అంపైర్స్ కాల్‌గా పరిగణిస్తూ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్థించాడు. ఈ నిర్ణయం పట్ల రోహిత్ అసహనం వ్యక్తం చేస్తూనే మైదానం వీడాడు.
ఇదెక్కడి రూల్?
అయితే 75 శాతం వరకు బంతి వికెట్లను తాకలేదని, అలాంటప్పుడు అంపైర్స్ కాల్ ఎలా అవుతుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ అంపైర్స్ కాల్ నిబంధన పెట్టింది ఎవరని, వాడికన్నా అర్థమవుతుందా? అని ఐసీసీపై మండిపడుతున్నారు. అంపైర్స్ కాల్ కారణంగా ప్రతీసారి భారత జట్టు బలి అవుతుందని కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సెట్ అయ్యాడని, డబుల్ సెంచరీ చేసేలా కనిపించాడని, దాంతోనే ఇంగ్లండ్ స్థానిక అంపైర్లు అతనిపై కుట్ర చేసే ఔటిచ్చారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎల్బీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది ఎలా అంపైర్స్ కాల్? చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
మత్తులో ఉన్నారా?
అంపైర్లు మత్తులో ఉన్నారా? అని మరో అభిమాని ఘాటుగా ప్రశ్నించాడు. హాక్ ఐ టెక్నాలజీలో బంతి 3 శాతమే తాకినట్లు స్పష్టమైందని, మరీ అంపైర్స్ కాల్ ఎలా ఇచ్చారని ప్రశ్నించాడు. నిబంధనల ప్రకారం 50 శాతం కన్నా ఎక్కువ తాకితినే కదా ఇచ్చేదని, అంపైర్లకు తాగిన మత్తు వదలలేదా? లేక చివరి క్షణంలో అంపైర్స్ కాల్ నిర్ణయాన్ని మార్చారా? అని సదరు ఫ్యాన్ నిలదీశాడు. మరికొందరు మాత్రం బంతి వికెట్లను ముద్దాడిందని, అందుకే ఔటిచ్చారని సమర్థిస్తూ.. ఈ నిబంధననే బాలేదని, మార్చాలని అభిప్రాయపడుతున్నారు. 2011లో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 91 పరుగుల వద్ద ఇదే అంపైర్స్ కాల్‌కు బలయ్యాడని, తాజాగా రోహిత్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నారని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.
అంపైర్ కాల్స్ అంటే ఏంటంటే?
ఎల్బీడబ్ల్యూకి సంబంధించిన నిబంధన ఇది. ఫీల్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆటగాళ్లు డీఆర్‌ఎస్ ద్వారా సమీక్ష కోరవచ్చు. ప్లేయర్ కోరిక మేరకు తన నిర్ణయం సరైనదా కాదా చూడమని థర్డ్ అంపైర్‌ను ఫీల్డ్ అంపైర్ కోరతాడు. అప్పుడు అటు ఇటుగా ఉన్న కొన్ని నిర్ణయాల పట్ల టీవీ అంపైర్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ అంపైర్స్ కాల్ అంటాడు. ఎల్బీడబ్ల్యూ విషయంలో ఫీల్డ్ అంపైర్ బ్యాట్స్‌మెన్‌ను నాట్ ఔట్‌గా ప్రకటించి, ప్రత్యర్థి జట్టు రివ్యూ కోరితే... బంతి కనీసం 50 శాతం వికెట్లను తాకుతున్నట్లు తేలితేనే ఔట్‌గా ప్రకటిస్తున్నారు.
ఎత్తును పెంచడంతో..
లేదంటే బ్యాట్స్‌మెన్ బతికిపోతున్నాడు. బంతి కొంచెం వికెట్లను తాకుతున్నట్లు కనిపించినా థర్డ్ అంపైర్ బ్యాట్స్‌మెన్‌ను అవుట్‌గా ప్రకటించాలని కోహ్లీ, సచిన్, బీసీసీఐ గతంలో డిమాండ్ చేశాడు. కానీ ఐసీసీ కమిటీ మాత్రం పాత నియమాన్నే కొనసాగించింది. కాకపోతే వికెట్ జోన్ ఎత్తును మాత్రం పెంచింది. ఇప్పటి వరకు బెయిల్స్ వరకు ఉండే ఎత్తును మాత్రమే ఎల్బీడబ్ల్యూ లెక్కలోకి తీసుకునేవారు. తాజా నిర్ణయంలోనూ బెయిల్స్ పైవరకు ఉండే ఎత్తును పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ కొత్త మార్పుతోనే రోహిత్ ఔటవ్వాల్సి వచ్చిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం భారత్ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది. ఆట నాలుగో రోజు పుజారా, కోహ్లీసుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటంతోపాటు ఇతర బ్యాట్స్‌మెన్ రహానే, జడేజా, పంత్ కూడా కదంతొక్కితే ఈ మ్యాచ్‌లో భారత్ కోలుకునే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications