టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో 129 బంతుల్లో 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. రెహాన్ అహ్మద్ వేసిన 53వ ఓవర్‌లో మూడో బంతికి క్విక్ డబుల్ తీసి సెంచరీ మార్క్ అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్ అనంతరం పేలవ ఫామ్‌తో సతమతమైన రోహిత్.. ఎట్టకేలకు ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. రోహిత్‌కు ఇది 11వ టెస్ట్ సెంచరీ.
ఈ క్రమంలో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన రెండో భారత ఓపెనర్‌గా నిలిచాడు. సునీల్ గవాస్కర్ 4 శతకాలతో టాప్‌లో ఉండగా.. రోహిత్ శర్మ 3 శతకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌పై టెస్ట్‌ల్లో రోహిత్ 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
23 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక శతకాలు, హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ప్లేయర్‌గా రోహిత్ నిలిచాడు. ఇప్పటి వరకు 50 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ 8 శతకాలతో పాటు 6 అర్థశతకాలు నమోదు చేశాడు.

ఈ తరం క్రికెటర్లలో అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 80 శతకాలతో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. డేవిడ్ వార్నర్(49), రోహిత్ శర్మ(47), జోరూట్(46), స్టీవ్ స్మిత్(44), కేన్ విలియమ్సన్(44) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా కూడా రోహిత్ నిలిచాడు. మూడు ఫార్మాట్లలో కలిపి సౌరవ్ గంగూలీ 1877 ప్లస్ రన్స్ నమోదు చేశాడు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీని అధిగమించాడు. దాదా మూడు ఫార్మాట్లలో కలిపి 1875 పరుగులు చేశాడు. ఈ జాబితాలో 34357 పరుగులతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ(26733), రాహుల్ ద్రవిడ్(24208) రోహిత్ కన్నా ముందున్నారు.
టెస్ట్‌ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన రెండో భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోనీని అధిగమించాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్(91) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రోహిత్(79) సిక్స్‌లతో రోహిత్ రెండో స్థానంలో నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోనీ(78) సిక్స్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు. కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన మూడో సారథిగా నిలిచాడు. ఇయాన్ మోర్గాన్(233) అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్(211), ధోనీ(211), రికీ పాంటింగ్(171) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఈ మూడో టెస్ట్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. సెకండ్ సెషన్ ముగిసే సరికి 58 ఓవర్లలో 3 వికెట్లకు 203 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(111 బ్యాటింగ్)తో పాటు రవీంద్ర జడేజా(70 బ్యాటింగ్)క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్(10), శుభ్‌మన్ గిల్(0), రజత్ పటీదార్(5) దారుణంగా విఫలమయ్యారు.
33 పరుగులకే 3 వికెట్లు కోల్పోగా.. జడేజాతో కలిసి రోహిత్ జట్టును ఆదుకున్నాడు. నాలుగో వికెట్‌కు అజేయంగా 170 పరుగులు జోడించారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్‌వుడ్ రెండు వికెట్లు తీయగా.. టామ్‌హార్ట్‌లీ ఓ వికెట్ పడగొట్టాడు.