ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా.. మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. సాగర తీరం విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన హోరాహోరీ పోరులో టీమిండియా చేజేతులా విజయాన్ని చేజార్చుకుంది.
పేలవ బ్యాటింగ్‌తో 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే వైజాగ్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో విజయం సాధించి ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. ఇప్పటికే తొలి టెస్ట్‌లో చేసిన తప్పిదాలపై ఫోకస్ పెట్టిన టీమిండియా మేనేజ్‌మెంట్ పకడ్బందీ ప్రణాళికలను సిద్దం చేస్తోంది.

అయితే వైజాగ్ వేదికగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మంచి రికార్డు ఉండటం అభిమానులను సంతోషపరుస్తోంది. పైగా వైజాగ్ రోహిత్ శర్మ అమ్మమ్మ ఊరు. తన తల్లి జన్మించిన ప్రదేశం కావడంతో ఫ్యాన్స్ మరింత సంతోషపడుతున్నారు. ఇక్కడ ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ.. రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు నమోదు చేయడం గమనార్హం. 2019లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు నమోదు చేశాడు.
ఓపెనర్‌గా ప్రమోషన్ అందుకున్న తర్వాత.. వీరేంద్ర సెహ్వాగ్‌లా దూకుడుగా ఆడాలని అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించిన తర్వాత రోహిత్ శర్మ ఆడిన మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ(244 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్స్‌లతో 176) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకోగా.. రెండో ఇన్నింగ్స్‌లో 149 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 127 శతకం బాదాడు. ఐదు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 203 పరుగుల భారీ స్కోర్‌తో గెలిచింది.
ఈ మ్యాచ్ రికార్డు నేపథ్యంలోనే అమ్మమ్మ ఊరులో రోహిత్ శర్మ చెలరేగుతాడని, ఇంగ్లండ్‌కు దబిడి దిబిడేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. వైజాగ్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. ఈ క్రమంలోనే రెండో టెస్ట్ కూడా ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్‌కు స్టార్ ప్లేయర్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయాలతో జట్టుకు దూరమవడం భారత్ కష్టాలను రెట్టింపు చేసింది. ఈ ఇద్దరి స్థానాల్లో బీసీసీఐ ముగ్గురిని ఎంపిక చేసింది. గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ.. జడేజాకు రిప్లేస్‌మెంట్‌గా సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను తీసుకుంది.
తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన శుభ్‌మన్ గిల్‌పై కూడా వేటు పడే అవకాశం ఉంది. అతన్ని పక్కన పెడితే సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్ అరంగేట్రం చేస్తారు.