టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ బజ్‌బాల్ గేమ్ అప్రోచ్‌కు ధీటుగా బదులిచ్చి సిరీస్ కైవసం చేసుకున్న తొలి సారథిగా నిలిచాడు. ఇంగ్లండ్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్, హెడ్ కోచ్‌గా మెక్ కల్లమ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ జట్టు ఓడిపోయిన తొలి సిరీస్ ఇదే. బజ్‌బాల్ గేమ్‌తో టెస్ట్‌లకు సరికొత్త ఊపును తీసుకొచ్చిన ఈ ఇంగ్లండ్ ద్వయం.. బజ్‌బాల్ అప్రోచ్‌తో ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు.
న్యూజిలాండ్, పాకిస్థాన్‌లపై సంచలన విజయాలు అందుకున్న ఇంగ్లీష్ టీమ్.. యాషెస్ సిరీస్‌ను సమం చేసింది. ఇప్పడు భారత్‌తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయింది. రాంచీ వేదికగా ఉత్కంఠగా సాగిన నాలుగో టెస్ట్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ధ్రువ్ జురెల్(77 బంతుల్లో 2 ఫోర్లతో 39 నాటౌట్), శుభ్‌మన్ గిల్(124 బంతుల్లో 2 సిక్స్‌లతో 52 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో భారత్‌కు విజయాన్ని అందించారు.

192 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 61 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసి గెలుపొందింది. ధ్రువ్ జురెల్, శుభ్‌మన్ గిల్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ(55) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ మూడు వికెట్లు తీయగా.. జో రూట్, టామ్ హార్ట్‌లీ తలో వికెట్ తీసారు.
ఈ గెలుపుతో టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. దాంతో బజ్‌బాల్ అప్రోచ్‌తో ఆడుతున్న ఇంగ్లండ్‌పై సిరీస్ గెలిచిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. సొంతగడ్డపై భారత్‌కు ఇది వరుసగా 17వ టెస్ట్ సిరీస్ విజయం కావడం విశేషం. ఈ ఘనతను అందుకున్న తొలి జట్టుగా భారత్ నిలిచింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌటైంది. జో రూట్(122 నాటౌట్) అజేయ శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కగా.. అశ్విన్ ఓ వికెట్ తీసాడు.
అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులే చేసింది. ధ్రువ్ జురెల్(90) అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకోగా.. యశస్వి జైస్వాల్(73) తన ఫామ్‌ను కొనసాగించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్(5/119) ఐదు వికెట్లు తీయగా.. టామ్ హార్ట్‌లీ మూడు వికెట్లు పడగొట్టాడు.
46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 145 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్ 5 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసాడు. 192 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 61 ఓవర్లలో 5 వికెట్లకు లక్ష్యాన్ని చేధించి సునాయస విజయాన్నందుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ మూడు వికెట్లు తీయగా.. జో రూట్, టామ్ హార్ట్‌లీ తలో వికెట్ తీసారు.