IND vs ENG: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన లోస్కోరింగ్ గేమ్‌లో టీమిండియా 100 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న టీమిండియా.. సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ సత్తా చాటగా.. బౌలింగ్‌లో మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ నిప్పులు చెరిగారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87) తృటిలో శతకం చేజార్చుకోగా.. సూర్యకుమార్ యాదవ్(47 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 49) హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో ఔటయ్యాడు.

కేఎల్ రాహుల్(58 బంతుల్లో 3 ఫోర్లతో 39), జస్‌ప్రీత్ బుమ్రా(25 బంతుల్లో ఫోర్‌తో 16) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే(3/45) మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్(2/33), ఆదిల్ రషీద్(2/35) రెండేసి వికెట్లు దక్కాయి. మార్క్‌వుడ్ (1/46) ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్.. 34.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ షమీ(4/22), జస్‌ప్రీత్ బుమ్రా(3/32), కుల్దీప్ యాదవ్(2/24) ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. రవీంద్ర జడేజా(1/16)కు ఓ వికెట్ దక్కింది. సంచలన బౌలింగ్‌తో 229 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్నారు.
ఇంగ్లండ్ బ్యాటర్లలో లియామ్ లివింగ్ స్టోన్(27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జోరూట్, బెన్ స్టోక్స్, మార్క్ వుడ్ డకౌట్‌గా వెనుదిరిగారు. డేవిడ్ విల్లే(16 నాటౌట్) అజేయంగా నిలవగా.. బెయిర్ స్టో(14), డేవిడ్ మలాన్(16), జోస్ బట్లర్(10), మొయిన్ అలీ(15), క్రిస్ వోక్స్(10), ఆదిల్ రషీద్(13) దారుణంగా విఫలమయ్యారు.
స్వల్ప లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్‌కు జస్‌ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే డబుల్ స్ట్రోక్ ఇవ్వగా.. షమీ, కుల్దీప్ యాదవ్ కోలుకోలేని దెబ్బతీసారు. దాంతో ఇంగ్లండ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. డ్యూ వచ్చినా.. భారత బౌలర్లు సత్తా చాటారు.