ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్‌లో విజయం సాధించాలని టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ సహచర ఆటగాళ్లను కోరాడు. దేశం కోసం గెలుద్దామని పిలుపునిచ్చాడు. ఆదివారం ముగిసిన నాలుగో టెస్ట్‌ను అద్వితీయమైన పోరాటంతో టీమిండియా డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో బంతి అతని కుడి పాదానికి బలంగా తాకింది. దాంతో పంత్ కుడికాలి చివరి వేలికి ఫ్రాక్చర్ అయ్యింది. ఈ గాయంతోనే తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన పంత్.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్ చేసేందుకు సిద్దమయ్యాడు. కానీ జడేజా-వాషింగ్టన్ సుందర్ ఆ అవసరం రాకుండా ఆడి మ్యాచ్‌ను డ్రా ముగించారు. తీవ్రంగా గాయపడిన పంత్.. ఆఖరి టెస్ట్‌కు దూరమయ్యాడు. అతనికి 6 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.ఈ క్రమంలోనే నాలుగో టెస్ట్ అనంతరం టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి రిషభ్ పంత్ మాట్లాడాడు.

'నా జట్టుకు ఒకే ఒక్క సందేశం ఇస్తున్నా. మామ మనం గెలుద్దాం. దేశం కోసం విజయం సాధిద్దాం. వ్యక్తిగత లక్ష్యం కంటే జట్టు కోసం ఆడుదాం. నేను వ్యక్తిగత ప్రదర్శనల కంటే జట్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. నా సహచర ఆటగాళ్లంతా ఇలాంటి సమయంలో అండగా ఉండటం బాగుంది. దేశం కోసం ఆడేటప్పుడు జట్టు ఒత్తిడిలో ఉన్నా సరే ప్రతీ ఒక్కరూ మద్దతు ఇస్తారు. అలాంటి భావోద్వేగాలను వివరించడం చాలా కష్టం. నా దేశం తరఫున ఆడడాన్ని ఎప్పుడూ గర్వంగానే భావిస్తా.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
రిషభ్ పంత్‌పై టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. పంత్‌ను ఎంత పొగిడినా తక్కవేనన్నాడు. 'నేనెప్పుడూ వ్యక్తిగత ప్రదర్శనల గురించి మాట్లాడను. నాకు అది నచ్చదు. కానీ మాంచెస్టర్ టెస్ట్‌లో రిషభ్ పంత్ గాయంతో బ్యాటింగ్ చేసి జట్టుకు విలువైన పరుగులు అందించాడు. అతని పోరాటం రాబోయే తరాలకు స్ఫూర్తి. అతన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అతన్ని ఎంత ప్రశంసించినా తక్కువే.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.