మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ బ్యాటర్లు చెలరేగారు. బెన్ డక్కెట్(56 బంతుల్లో 10 ఫోర్లతో 65), జోరూట్(72 బంతుల్లో 6 ఫోర్లతో 69) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. లియామ్ లివింగ్ స్టోన్(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), జోస్ బట్లర్(35 బంతుల్లో 2 ఫోర్లతో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/35) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.
అదిరిపోయే ఆరంభం..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్(29 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 26), బెన్ డక్కెట్ మరోసారి అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఫిలిప్ సాల్ట్ ఆచితూచి ఆడినా.. బెన్ డక్కెట్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఫిలిప్ సాల్ట్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను బ్యాక్‌వార్డ్ పాయింట్‌లో అక్షర్ పటేల్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్ని అతను అందిపుచ్చుకున్నాడు. పవర్ ప్లేలో ఇంగ్లండ్ 75 పరుగులు చేసింది. ఆ మరుసటి ఓవర్‌లోనే బెన్ డకెట్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని వరుణ్ చక్రవర్తీ విడదీసాడు. ఫిలిప్ సాల్ట్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 81 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

కొంపముంచిన రాహుల్..
క్రీజులోకి జోరూట్ రాగా.. హర్షిత్ రాణా బౌలింగ్‌లో 55 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బెన్ డక్కెట్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను శ్రేయస్ అయ్యర్ అందుకోలేకపోయాడు. దూకుడుగా ఆడుతూ సెంచరీ దిశగా సాగిన బెన్ డకెట్‌ను జడేజా పెవిలియన్ చేర్చాడు. టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ తప్పిదం కారణంగా జోరూట్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
అక్షర్ పటేల్ వేసిన 25వ ఓవర్ రెండో బంతికి జోరూట్ వికెట్ల ముందు దొరికిపోయాడు. కానీ టీమిండియా రివ్యూ తీసుకోలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ రివ్యూ తీసుకునేందుకు సిద్దమవ్వగా కేఎల్ రాహుల్ అతన్ని అడ్డుకున్నాడు. కానీ రిప్లేలో ఇది ఔట్‌గా తేలింది. ఈ రివ్యూను టీమిండియా తీసుకొని ఉంటే జోరూట్ 16 పరుగుల వద్దే ఔటయ్యేవాడు.
లివింగ్‌స్టోన్ విధ్వంసం..
ఈ అవకాశంతో అతను చెలరేగాడు. మరోవైపు హ్యారీ బ్రూక్(31)ను హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చి మూడో వికెట్‌కు నమోదైన 66 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. బ్యాటింగ్‌కు వచ్చిన బట్లర్ సాయంతో జోరూట్ 60 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నిలకడగా ఆడుతున్న బట్లర్(34)ను హార్దిక్ పాండ్యా ఔట్ చేయడంతో నాలుగో వికెట్‌కు నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ కాసేపటికే తన వరుస ఓవర్లలో జడేజా జోరూట్‌తో పాటు జేమీ ఓవర్టన్‌ను ఔట్ చేయగా.. గస్ అట్కిన్సన్(3)ను షమీ పెవిలియన్ చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు లివింగ్ స్టోన్ దూకుడుగా ఆడాడు. ఆదిల్ రషీద్(14) రనౌటవ్వగా.. మార్క్ వుడ్ సాయంతో లివింగ్ స్టోన్ జట్టు స్కోర్‌ను 300 పరుగులు ధాటించాడు. ఆఖరి ఓవర్‌లో స్ట్రైకింగ్ ఉంచుకోవాలనే ఆతృతలో లివింగ్ స్టోన్ రనౌటయ్యాడు. ఆ మరుసటి బంతికే మార్క్ వుడ్ సైతం రనౌటవ్వడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.