టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి తన సతీమణి, గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజాపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. రాజ్‌కోట్ టెస్ట్‌లో సంచలన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన జడేజా.. ఈ అవార్డును తన సతీమణి రివాబా జడేజాకు అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు.
ఆమె సహకారంతోనే తాను అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించగలుగుతున్నానని, తన సక్సెస్ వెనుక రివాబా కష్టం ఎంతో ఉందని చెప్పాడు. ఇటీవలే రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సింగ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో తన కోడలు రివాబా జడేజాపై సంచలన ఆరోపణలు చేశారు. రివాబా కారణంగా తన కొడుకు జడేజాతో ఉన్న సంబంధం తెగిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసలు జడేజా క్రికెటర్ కాకపోయి ఉంటే బాగుండేదని బాధపడ్డారు. తన మనువరాలిని చూడక ఐదేళ్లు అవుతుందని భావోద్వేగానికి గురయ్యారు. ఒకే ఊరిలో ఉంటున్నా తమ మధ్య మాటలు లేవని చెప్పారు. 'నా కడుపు రగిలిపోతుంది. జడేజాకు పెళ్లి చేసి పెద్ద తప్పు చేశాను. అసలు జడేజా క్రికెటర్ కాకపోయి ఉంటే బాగుండేది.
అతను క్రికెటర్ కాకపోయి ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. పెళ్లయిన మూడు నెలల్లోనే అన్నీ తన పేరు మీదకు మార్చాలని జడేజా భార్య చెప్పింది. మా కుటుంబంలో చిచ్చు పెట్టింది. కలిసి ఉండాలనే ఉద్దేశం తనకి లేదు. వేరుగా ఉండాలని భావించేది. నేను, నైనానా (రవీంద్ర సోదరి) చెప్పేది తప్పనుకోవచ్చు. కానీ మా ఫ్యామిలోని 50 మంది తప్పుగానే చెప్తారా? చివరికి కుటుంబంలో ద్వేషమే మిగిలింది'అని అనిరుధ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఆరోపణలను జడేజా కొట్టిపారేసాడు. 'ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్న విషయాలు అర్ధరహితం. పచ్చి అబద్ధాలు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అవి నా భార్య ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు. ఇది సరికాదు. నేను కూడా చాలా విషయాలు చెప్పాలి. కానీ అవి చెప్పకపోవడమే మంచిది'అని జడేజా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు.
తాజాగా తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను సతీమణి రివాబా జడేజాకు అంకితం చేసి ఆమెపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ జడేజా ఈ వ్యాఖ్యలు చేశాడు.
'రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనతను అందుకోవడం ప్రత్యేకంగా ఉంది. అది కూడా ఒకే టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో శతకం.. మరో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనతను అందుకోవడం ఆల్‌రౌండర్‌గా నాకు గొప్ప అనుభూతినిచ్చింది. నా హోమ్ గ్రౌండ్‌లో నాకు దక్కిన స్పెషల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇది. ఈ అవార్డును నా సతీమణికి అంకితం ఇవ్వాలనుకుంటున్నా. నా సక్సెస్ వెనుక ఆమె కష్టం ఎంతో ఉంది. మానసికంగా ధృడంగా ఉండేలా ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.'అని జడేజా చెప్పుకొచ్చాడు.