గువాహటి: వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియా తొలి సన్నాహక మ్యాచ్‌కు సిద్దమైంది. గువహాటి వేదికగా మరికొద్దిసేపట్లో ఇంగ్లండ్‌తో తొలి వామప్ మ్యాచ్ ఆడనుంది. జట్టులోని ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఇప్పటికే సందేహాలు తొలగిపోగా.. తుది జట్టు కాంబినేషన్‌పై కూడా ఓ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు కావాల్సిదంతా మరింత ఆత్మవిశ్వాసంతో.. ప్రపంచకప్‌కు సిద్ధం కావడమే.
పూర్తి స్థాయి జట్టుతో బరిలో దిగి సత్తా చాటడమే రోహిత్ సేనకు కావాలి. వామప్ మ్యాచ్‌లతో మెగా టోర్నీకి కావాల్సిన సన్నదతను పూర్తి చేసుకోవడంపై టీమిండియా ఫోకస్ పెట్టింది. ఆస్ట్రేలియాపై సిరీస్ నెగ్గి ఉత్సాహంతో ఉన్న భారత జట్టు.. ఇంగ్లండ్‌తో సన్నాహక మ్యాచ్‌లో విజయం సాధించాలని కోరుకుంటోంది.

ఇంగ్లండ్ కూడా జట్టులోని వనరుల్ని పూర్తిగా పరిశీలించుకోవాలని భావిస్తోంది. ఇరుజట్లు వీలైనంత ఎక్కువ మంది ఆటగాళ్లను మైదానంలోకి దించనున్నాయి. వాస్తవానికి వార్మప్ మ్యాచ్‌ల్లో ఏ జట్టు కూడా తమ వూహాల్ని బయట పెట్టదు. కానీ దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించడాన్ని ఇంగ్లండ్ అలవాటుగా మార్చుకుంది.
బెయిర్‌స్టో, బట్లర్, మలన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, మొయీన్ అలీల విధ్వంసక బ్యాటింగ్ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో తమ బౌలర్లను పరీక్షించుకోడానికి ఇంగ్లండ్‌తో వార్మప్ పోరు మంచి అవకాశంగా భారత్ భావిస్తోంది. మరోవైపు బ్యాటింగ్ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ల మధ్య పోటీ నెలకొంది.
శ్రేయస్ గాయంతో జట్టుకు దూరమైన సమయంలో ఇషాన్‌కు లభించిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నాడు. అయితే మధ్య ఓవర్లలో స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనే శ్రేయస్ పట్ల జట్టు మేనేజ్‌మెంట్ మొగ్గుచూపే అవకాశం ఉంది. బ్యాటింగ్ విభాగంలో బ్యాటర్లందరికి సరైన ప్రాక్టీస్ లభించనుంది.
స్పిన్ బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో తడబడుతున్న టీమిండియా ఆ సమస్యలను అధిగమించడంపై ఫోకస్ పెట్టింది. ఇక తొలి వామప్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.