టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి సహనం కోల్పోయాడు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాడితో గొడవకు దిగాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నాలుగో రోజు ఆట ఫస్ట్ సెషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
జస్‌ప్రీత్ బుమ్రా వేసిన 43వ ఓవర్‌లో బెయిర్ స్టో(26) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఈ ఓవర్ నాలుగో బంతికి అతను వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ కూడా ఔటివ్వడంతో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో అశ్విన్.. బెయిర్ స్టో ముందుకు వెళ్లి మరీ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బెయిర్ స్టో నోటికి పనిచెప్పాడు.

అశ్విన్ కూడా ధీటుగా బదులిచ్చాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రివ్యూలో కూడా బెయిర్ స్టో ఔటని తేలడంతో అశ్విన్ మరింత సంతోషంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో తొలి రోజు నుంచి అశ్విన్ చాలా అగ్రెసివ్‌గా కనిపించాడు.
తొలి రోజు ఆటను త్వరగా ముగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంపైర్ ఎరాస్మస్‌తో అశ్విన్ గొడవపడ్డాడు. రెండో రోజు ఆటలో జేమ్స్ అండర్సన్ బౌలింగ్ చేసే సమయంలో తన చేష్టలతో తన రనప్‌ను అడ్డుకున్నాడు. తాజాగా బెయిర్ స్టోతో వాగ్వాదానికి దిగాడు. అశ్విన్ చర్యలపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొందరు అతని చర్యలను మెచ్చుకుంటుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. విరాట్ కోహ్లీ గర్వపడేలా అశ్విన్ వ్యవహరిస్తున్నాడని కొందరు ప్రశంసిస్తుండగా.. ఓ సీనియర్ ఆటగాడిగా ఇలాంటి పనులు చేయడం సరికాదని మరికొందరు అంటున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ తీయని అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటికే 3 వికెట్లు తీసాడు. టెస్ట్‌ల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచాడు. మరో వికెట్ తీస్తే అశ్విన్ ఈ ఫీట్ సాధించనున్నాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(209) ఒక్కడే డబుల్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు కుప్పకూలింది. జస్‌ప్రీత్ బుమ్రా(6/45) 6 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. దాంతో భారత్‌కు 143 పరుగుల ఆధిక్యం లభించింది.
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్(104) ఒక్కడే సెంచరీ సాధించగా.. అక్షర్ పటేల్(45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో ఇంగ్లండ్ ముందు 399 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. అశ్విన్ ధాటికి ఇంగ్లండ్ 220 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది.