ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమికి తానే ప్రధాన కారణమని స్టార్ పేసర్ ప్రసిధ్ కృష్ణ అన్నాడు. అంచనాలకు తగ్గట్లు తాను బౌలింగ్ చేయలేకపోయానని తన తప్పిదాన్ని అంగీకరించాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ప్రసిధ్ కృష్ణ దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 220 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసాడు.
ఓవైపు బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.. మరోవైపు ప్రసిధ్ కృష్ణ ధారళంగా పరుగులిచ్చాడు. దాంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 371 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. తాజాగా తన ప్రదర్శనపై మాట్లాడిన ప్రసిధ్ కృష్ణ.. లోపాలను సరిదిద్దుకొని మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు.

'తొలి ఇన్నింగ్స్‌లో నేను ఆశించిన రీతిలో బౌలింగ్ చేయలేదు. రెండో ఇన్నింగ్స్ వచ్చేసరికి పిచ్ నెమ్మదించడంతో నా బౌలింగ్ కాస్త మెరుగైంది. కచ్చితంగా నేను అనుకున్న విధంగా సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేకపోయాను. పిచ్‌ను అర్థం చేసుకోవడం విఫలమయ్యాను. ప్రొఫెషనల్ ఆటగాడిగా నా లోపాలను అధిగమించే ప్రయత్నం చేస్తాను. ఈ విషయంలో పూర్తి బాధ్యత తీసుకుంటాను.
భవిష్యత్తు మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాను. ప్రతీ ఓవర్‌నూ మెయిడిన్ చేయాలనుకుంటా. బౌండరీలు ఇవ్వాలనుకోను. తొలి టెస్ట్‌లో ఔట్ ఫీల్డ్ వేగంగా ఉంది. నిజం చెప్పాలంటే.. నేను బౌలింగ్ చేసిన లైన్ అండ్ లెంగ్త్ చాలా సార్లు పర్ఫెక్ట్‌గా లేదు. దాంతో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగులు రాబట్టారు. కొన్నిసార్లు బంతి బ్యాట్ ఎడ్జ్‌లకు తాకి బౌండరీలకు వెళ్లాయి. తొలి టెస్ట్‌లో నేను దారుణంగా విఫలమయ్యాను.'అని ప్రసిధ్ కృష్ణ చెప్పుకొచ్చాడు.