ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్ట్‌లకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఊహించినట్లుగానే ఇంగ్లండ్‌తో సిరీస్ మొత్తానికి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. తొలి రెండు టెస్ట్‌ల్లో దారుణంగా విఫలమైన శ్రేయస్ అయ్యర్‌పై వేటు పడింది. అయితే శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పితో పాటు గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడని, దాంతోనే చివరి మూడు టెస్ట్‌లకు ఎంపిక చేయలేదని బీసీసీఐ వివరణ ఇచ్చింది.
అయితే గాయం పేరిట శ్రేయస్ అయ్యర్‌ను తప్పించారనే వాదన వినిపిస్తోంది. ఎలాంటి గాయం లేకున్నా.. తొలి రెండు టెస్ట్‌ల్లో దారుణంగా విఫలమవడంతో పక్కనపెట్టారని, కారణం లేకుండా పక్కనపెడితే విమర్శలు వస్తాయని గాయం పేరిట బీసీసీఐ కవరింగ్ ఇచ్చిందనే అభిప్రాయయం వ్యక్తమవుతోంది.

శ్రేయస్ అయ్యర్ గాయంతో బాధపడి ఉంటే.. బీసీసీఐ మెడికల్ టీమ్ అప్‌డేట్ ఇచ్చేదని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. దాంతోనే గాయం పేరిట అతనిపై వేటు వేసారనేది అర్థమవుతుందన్నాడు.
గాయాలతో రెండో టెస్ట్‌కు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు చివరి మూడు మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చారు. అయితే ఫిట్‌నెస్ టెస్ట్ పాసైతేనే వాళ్లు మ్యాచ్ ఆడుతారని స్పష్టం చేసింది. ఇక వ్యక్తిగత కారణాలతో కోహ్లీ చివరి మూడు మ్యాచ్‌లు కూడా ఆడటం లేదని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది.
యువ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటిదార్ జట్టులో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. యువ పేసర్ ఆకాశ్ దీప్‌కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లొ ఆకాశ్ సత్తాచాటాడు. విశ్రాంతి పేరిట రెండో టెస్ట్‌కు దూరమైన మహమ్మద్ సిరాజ్ కూడా రీ ఎంట్రీ ఇచ్చాడు. జస్‌ప్రీత్ బుమ్రా, ముకేశ్ కుమార్‌లు కూడా జట్టులో కొనసాగారు.
ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్.