ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్‌కు టీమిండియా సిద్దమైంది. గురువారం నుంచి లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ప్రారంభమయ్యే చివరి టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో 2-1తో వెనుకంజలో ఉన్న టీమిండియా.. ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని, తుది జట్టులో కుల్దీప్ యాదవ్‌కు అవకాశం కల్పించనుందని వార్తలు వచ్చాయి. కానీ టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాత్రం.. కుల్దీప్ యాదవ్‌ను ఆడించడం లేదని పరోక్షంగా హింట్ ఇచ్చాడు.
నాలుగో టెస్ట్ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన శుభ్‌మన్ గిల్.. టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతోనే ఆడుతుందని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్ స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగుతుందని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తాము ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లు అయిన రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌తో ఆడుతామని బదులిచ్చాడు. తుది జట్టు ఎంపికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించిన గిల్.. అర్ష్‌దీప్ సింగ్‌ను మ్యాచ్‌కు సిద్దంగా ఉండాలని చెప్పామని తెలిపాడు. బుమ్రా ఆడే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం వికెట్ చాలా గ్రీన్‌గా కనిపిస్తోందని, గురువారం ఉదయం తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాడు.

'ఇంగ్లండ్ ఫ్రంట్ లైన్ స్పిన్నర్ లేకుండా ఆడుతున్నా.. మేం జడేజా, వాషింగ్టన్ సుందర్‌లతో బరిలోకి దిగుతున్నాం. తుది జట్టు ఎంపికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అర్ష్‌దీప్ సింగ్‌ను మ్యాచ్‌కు సిద్దంగా ఉండాలని చెప్పాం. ఈ సాయంత్రం పిచ్‌ను మరోసారి పరిశీలించిన తర్వాత అతను ఆడే విషయాన్ని నిర్ణయిస్తాం. జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చే విషయంపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పిచ్ చాలా పచ్చగా కనిపిస్తోంది. గురువారం ఉదయం వికెట్‌ను పరిశీలించి అతనికి రెస్ట్ విషయాన్ని ఆలోచిస్తాం. ఈ సిరీస్‌ను సమం చేయడం మా లక్ష్యం. ఇక్కడ మేం ఆడిన ప్రతీ మ్యాచ్‌లో.. తొలి నాలుగు రోజుల్లో విజేత ఎవరా? అని చెప్పలేకపోయారు. ఈ సిరీస్ మాకు ఓ గుణపాఠం.
ఓవల్ పిచ్ క్యూరేటర్‌లా ఎవరూ మమ్మల్ని వికెట్ దగ్గరకు వెళ్లకుండా అడ్డుకోలేదు. మేం ఎన్నో ఏళ్ల నుంచి ఆడుతున్నాం. కానీ మాకు ఇలాంటి అనుభవం ఎప్పుడు ఎదురవ్వలేదు. రబ్బర్ స్పైక్స్, బేర్‌ఫుట్ వేసుకొని కూడా పిచ్‌ను చూసేవాళ్లం. కానీ ఓవల్ పిచ్ క్యూరేటర్ వికెట్ చూడకుండా మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారో నాకు అర్థం కావడం లేదు.