IND vs ENG: 1000 రోజులుగా 100 కరువు.. విరాట్ కోహ్లీ ముంగిట చెత్త రికార్డు!

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి నీళ్ల ప్రాయంగా సెంచరీలు బాదిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ గత మూడేళ్లుగా ఏ ఫార్మాట్లలోనూ శతకం చేయలేదు. చివరిసారిగా 2019లో నవంబర్ 22న బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక డేనైట్ టెస్ట్‌లో కోహ్లీ శతకం అందుకున్నాడు. ఆ తర్వాత మూడు ఫార్మాట్లలో కలిపి 24 హాఫ్ సెంచరీలు బాదినా శతకాన్ని అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 11, 20, 1, 11, 16 రన్స్ చేశాడు.

1000 రోజులు..
ఈ క్రమంలోనే నేడు(ఆదివారం) మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ చేయకుంటే చెత్త రికార్డును తన పేరిట లిఖించుకోనున్నాడు. 1000 రోజులుగా సెంచరీ చేయని క్రికెటర్‌గా అప్రతిష్టను మూటగట్టుకోనున్నాడు. తన కెరీర్ ప్రారంభమైన 4114 రోజుల్లోనే 70 సెంచరీలు బాదిన విరాట్.. 1000 రోజులుగా శతకం చేయకపోవడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. విరాట్ కోహ్లీ సెంచరీ చేయక నేటికి సరిగ్గా 966 రోజులు. ఇక వన్డే క్రికెట్‌లో 2019, ఆగస్టు 14న వెస్టిండీస్‌పై కోహ్లీ తన చివరి సెంచరీ బాదాడు. ఈ క్రమంలోనే మాంచెస్టర్ వేదికగా జరిగే మూడో వన్డేలో కోహ్లీ సెంచరీ చేయాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.

సెంచరీ లేకుంటేనేం..
సెంచరీ చేయకున్నా విరాట్ కోహ్లీ పరుగుల మోత మోగించాడు. 2020 నుంచి ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లీ 24 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 45.26 సగటు, 91.39 సగటుతో 1041 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఎలాంటి, ఏ స్థాయి ప్రమాణాల ప్రకారం చూసినా వన్డేల్లో ఇవి ఎంతో మెరుగైన బ్యాటింగ్ గణాంకాలు. 2020 జనవరి నుంచి విరాట్ 21 అంతర్జాతీయ టీ20ల్లో 42.18 సగటు, 136.08 స్ట్రైక్‌రేట్‌తో 675 పరుగులు చేశాడు.
ఇందులో 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇదీ టీ20లో ఒక రెగ్యులర్, పూర్తి స్థాయి బ్యాటర్ కోణంలో చూస్తే చక్కటి ప్రదర్శన. గత రెండున్నరేళ్లుగా 18 టెస్టుల్లో 27.25 సగటుతో 872 పరుగులు మాత్రమే. ఒక్క సెంచరీ కూడా లేదు. ఇది మాత్రం విమర్శకు అవకాశమిచ్చే అతి సాధారణ ప్రదర్శన. కానీ ఇదే సమయంలో ఇతర భారత టెస్టు బ్యాటర్ల స్కోర్లు కూడా అంత గొప్పగా ఏమీ లేవు.

ఘనతలే..
అయినా విరాట్‌ను ఎందుకు విమర్శిస్తున్నారంటే.. అతను సాధించిన ఘనతలే. అవే ఇప్పుడు అతనికి శాపంగా మారాయి. అద్భుత ప్రదర్శనతో అత్యుత్తమ స్థాయి ప్రమాణాలు నెలకొల్పిన కోహ్లీ...ఇప్పుడు వాటితో పోలిక రావడంతోనే విఫలమైనట్లుగా కనిపిస్తోంది. నిజాయితీగా చెప్పాలంటే కోహ్లీ కాకుండా మరే బ్యాట్స్‌మన్ అయినా ఈ గణాంకాలతో కొనసాగితే అతను ఫామ్‌లో ఉన్నట్లే లెక్క. గత మూడేళ్లుగా విరాట్ సెంచరీ చేయకపోవడం కూడా ఈ విమర్శలకు కారణమైంది. అడపాదడపా అతను హాఫ్ సెంచరీలు బాదినా అవి సగటు అభిమాని లెక్కలోకి రాలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications