సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ నుంచి యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి అర్థాంతరంగా తప్పుకున్నాడు. రెండో టీ20కి ముందు అతను ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డాడు. చెన్నై వేదికగా శుక్రవారం నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో నితీష్ కుమార్ రెడ్డి పక్కటెముకల గాయానికి గురయ్యాడు.
గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ.. రెండో టీ20 ప్రారంభానికి ముందు అధికారికంగా ప్రకటించింది. అతను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌లో రిహాబిలిటేషన్ తీసుకుంటాడని తెలిపింది.

నితీష్ కుమార్ రెడ్డితో పాటు మరో స్టార్ ప్లేయర్ రింకూ సింగ్ గాయంతో బాధపడుతున్నాడని తెలిపింది. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో ఫీల్డింగ్ చేస్తూ రింకూ సింగ్ గాయపడ్డాడని, అతను వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని పేర్కొంది. ప్రస్తుతం అతన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోందని తెలిపింది.
ఈ గాయంతో అతను రెండో టీ20తో పాటు మూడో టీ20కి దూరమయ్యాడని పేర్కొంది. ఈ ఇద్దరి స్థానాల్లో శివమ్ దూబే, రమణ్‌దీప్ సింగ్‌లను ఎంపిక చేసినట్లు బీసీసీఐ తమ ప్రకటనలో రాసుకొచ్చింది.
ఇంగ్లండ్‌తో రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. గాయాలతో జట్టుకు దూరమైన నితీష్ కుమార్ రెడ్డి, రింకూ స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్‌ను తీసుకున్నట్లు సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.
ఇండియా రివైజ్డ్ టీమ్: సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తీ, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, శివమ్ దూబే, రమణ్‌దీప్ సింగ్.