టీమిండియా పేస్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ వేసిన రాకాసి బౌన్సర్ నితీష్ కుమార్ రెడ్డి హెల్మెట్‌కు బలంగా తాకింది. ఈ బౌన్సర్ ధాటికి నితీష్ కుమార్ రెడ్డి క్రీజులో కుప్పకూలిపోయాడు. హెల్మెట్ గ్రిల్‌కు బంతి తాకడంతో పెను ప్రమాదం తప్పింది. బెన్ స్టోక్స్ వేసిన 90వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఓవర్ రెండో బంతిని బెన్ స్టోక్స్ గంటకు 141 కిలో మీటర్ల వేగంతో వేయగా.. అనూహ్యంగా బౌన్స్ అయ్యి నితీష్ హెల్మెట్‌ను తాకింది. ఈ బంతి ధాటికి నితీష్ కళ్లు బైర్లు కమ్మాయి. హుటా హుటిన మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన ఫిజియో కంకషన్ టెస్ట్ చేశాడు. హెల్మెట్‌ను పరిశీలించి కొత్తది తెప్పించాడు. దవడ భాగంలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఐస్ ప్యాక్ తెప్పించాడు. హెల్మెట్ గ్రిల్ లేకపోతే నితీష్ కుమార్ రెడ్డి తీవ్రంగా గాయపడేవాడు. నితీష్ కుప్పకూలినా.. బెన్ స్టోక్స్ కనీసం అతన్ని పలకరించలేదు. క్రీజులో పాతుకపోయాడనే కోపంతో క్రీడాస్ఫూర్తిని మరిచాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

145/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్.. టీ బ్రేక్ సమయానికి 91 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. చివరి సెషన్ ఆరంభంలోనే నితీష్ కుమర్ రెడ్డి(31)ని బెన్ స్టోక్స్ పెవిలియన్ చేర్చాడు. దాంతో 6వ వికెట్‌కు నమోదైన 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన సుందర్‌తో కలిసి జడేజా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. అంతకుముందు కేఎల్ రాహుల్(100) సెంచరీతో రాణించగా.. రిషభ్ పంత్(74) హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌటైంది. జోరూట్(199 బంతుల్లో 10 ఫోర్లతో 104) సెంచరీతో రాణించగా.. జెమీ స్మిత్(56 బంతుల్లో 6 ఫోర్లతో 51), బ్రైడన్ కార్స్(83 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. బెన్ స్టోక్స్(44), ఒలీ పోప్(44) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(5/74) ఐదు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/85), నితీష్ కుమార్ రెడ్డి(2/62) రెండేసి వికెట్లు పడగొట్టారు.