
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా టేయిలెండర్ మహమ్మద్ షమీ (62 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ సాధించాడు. అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. సహచర ఆటగాడు జస్‌ప్రీత్ బుమ్రా(53 బంతుల్లో 2 ఫోర్లతో 28 బ్యాటింగ్)తో 9వ వికెట్‌కు 50 ప్లస్ పార్టనర్‌షిప్ నమోదు చేశాడు. 2015 తర్వాత భారత జట్టు తరఫున 9వ వికెట్‌కు నమోదైన 50 ప్లస్ పార్టనర్ షిప్ ఇదే. అయితే మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో సిక్సర్‌తో షమీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం.
పేస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటుండటంతో రూట్ స్పిన్నర్‌ను బరిలోకి దించగా.. షమీ చెలరేగాడు. అతను వేసిన 106 ఓవర్ తొలి బంతిని బౌండరీ తరలించిన షమీ.. ఆ మరుసటి బంతిని భారీ సిక్సర్‌గా మలిచి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షమీ హాఫ్ సెంచరీ పూర్తైన వెంటనే లార్డ్స్ బాల్కనీలోని భారత ఆటగాళ్లు స్టాండింగ్ ఓవేషన్‌తో అభినందనలు తెలిపారు. షమీకి ఇది కెరీర్‌లో రెండో హాఫ్ సెంచరీకాగా.. ఈ రెండు ఇంగ్లండ్ గడ్డపైనే సాధించడం గమనార్హం.
2014 పర్యటనలో షమీ మొదటి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. షమీ-బుమ్రా క్రీజులో అజేయంగా నిలిచి 9వ వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో లంచ్ బ్రేక్ సమాయనికి భారత్ 108 ఓవర్లలో 8 వికెట్లకు 286 రన్స్ చేసింది. ఈ ఇద్దరి విరోచిత ఇన్నింగ్స్‌తో భారత్ ఆధిక్యం 259 పరుగులకు చేరింది. ఇంగ్లండ్ గడ్డపై భారత్‌కు 9వ వికెట్‌కు నమోదైన అత్యధిక భాగస్వామ్యం ఇదే.
అంతకుముందు 181/6 ఓవర్ నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను కొనసాగించిన భారత్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఓటమి నుంచి జట్టును గట్టెక్కిస్తాడనుకున్న రిషభ్ పంత్(22) తీవ్రంగా నిరాశపరిచాడు. బౌండరీతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన పంత్.. రాబిన్సన్ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేయబోయి ఎక్స్‌ట్రా బౌన్స్ కారణంగా కీపర్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 194 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి మహమ్మద్ షమీ(4 బ్యాటింగ్) రాగా.. ఇషాంత్ శర్మ(12 బ్యాటింగ్) ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశాడు. రెండు బౌండరీలతో జోరు కనబర్చాడు. కానీ ఓలీ రాబిన్సన్ ఇషాంత్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. రివ్యూ తీసుకున్న ఫలితం లేకుండా పోయింది. దాంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనని అంతా భావించారు.
కానీ బుమ్రా-షమీ అద్భుతంగా పోరాడారు. ఇంగ్లండ్ బౌలర్లు రాకాసి బౌన్సర్లతో ఎదురుదాడికి దిగినా.. ధీటుగా బదులిచ్చారు. టాపార్డర్ బ్యాట్స్‌మన్ తరహాలో స్వేచ్చగా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి సహనాన్ని పరీక్షించారు. ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ బౌలర్లు మార్చినా.. ఫీల్డి సెటప్ జరిపినా.. వ్యూహం మార్చినా ఫలితం లేకపోయింది. దాంతో మ్యాచ్‌పై భారత్ పట్టు బిగించింది.