
మాంచెస్టర్: గాయంతో నాలుగో టెస్ట్‌కు దూరమైన టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. అతనితో పాటు నాలుగో టెస్ట్‌లో చీలమండ గాయానికి గురైన చతేశ్వర్ పుజారా కూడా పూర్తిగా కోలుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వర్గాలు తెలిపాయి. బుధవారం టీమిండియా సాధనలోనూ మహమ్మద్ షమీ పాల్గొన్నాడు. దీంతో శుక్రవారం ప్రారంభమయ్యే అయిదో టెస్టుకు షమీ, పుజారా అందుబాటులో ఉండనున్నాడు. మరోవైపు ఓపెనర్ రోహిత్‌శర్మ ఫిట్‌నెస్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. మోకాలి గాయంతో రోహిత్ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.
'మహమ్మద్ షమీ గాయం నుంచి కోలుకొని ఫిట్‌నెస్ సాధించాడు. దాంతో అతను ఆటోమెటిక్‌గా జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. పుజారా సైతం కోలుకున్నాడు. అయితే రోహిత్ శర్మ గాయాన్ని మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తుంది'అని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
నాలుగో టెస్ట్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తూ రోహిత్ శర్మ గాయపడ్డాడు. 353 నిమిషాలపాటు క్రీజులో నిలుచున్న రోహిత్ శర్మ తొడలు ఎర్రగా కమిలిపొయాయి. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో థై ప్యాడ్స్ రాసుకోవడం.. ఇంగ్లండ్ బౌలర్ల బంతులు బలంగా తాకడంతో రెండు తొడలకు గాయాలయ్యాయి. అంతేకాకుండా మోకాలికి కూడా గాయమైంది. అయితే ఈ గాయం తీవ్రత గురించి బీసీసీఐ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. కాకపోతే హిట్ మ్యాన్ నాలుగో టెస్ట్‌లో చివరి రెండు రోజులు ఫీల్డింగ్ చేయలేదు. ముందస్తు చర్యల్లో భాగంగానే అతనికి విశ్రాంతి ఇచ్చారు. ఒకవేళ రోహిత్ గాయం తీవ్రమైతే అతను ఆఖరి టెస్ట్‌కు దూరం కావచ్చు. అదే జరిగితే పృథ్వీ షా/మయాంక్ అగర్వాల్‌లో ఒకరు జట్టులోకి వస్తారు. పుజారాకు విశ్రాంతినిస్తే సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రం చేయనున్నాడు. షమీ కోలుకోవడంతో సిరాజ్/ జస్‌ప్రీత్ బుమ్రాల్లో ఒకరికి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్, ఐపీఎల్ దృష్ట్యా బుమ్రాకు రెస్ట్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో నిలిచిన కోహ్లీసేన సిరీస్ విజయానికి అడుగు దూరంలో నిలిచింది. ఆఖరి టెస్ట్‌లో గెలిచినా.. డ్రా చేసుకున్న సిరీస్ భారత్ కైవసం చేసుకోనుంది. 50 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఓవల్ మైదానంలో భారత జట్టు అద్భుత విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. గత సోమవారం ముగిసిన నాలుగో టెస్ట్‌లో కోహ్లీసేన 157 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసింది. విపత్కర పరిస్థితులను దాటుకుంటూ.. ప్రత్యర్థి పేస్ పరీక్షను తట్టుకుంటూ.. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌కు దిమ్మదిరిగే షాక్‌లిస్తూ కోహ్లీసేన జయకేతనం ఎగురవేసింది. దాంతో అచ్చిరాని మైదానంలోనే అసాధారణ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో సేఫ్‌గా నిలిచింది.