ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్ట్‌కు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ఈ మ్యాచ్‌కు తెరలేవనుంది. రాజ్‌కోట్ వేదికగా గురువారం ఉదయం 9.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. తొలి రెండు టెస్ట్‌ల్లో చెరొక మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. ఈ క్రమంలోనే మూడో టెస్ట్‌లో విజయం సాధించి పై చేయి సాధించాలనుకుంటున్నాయి.
ఇక ఈ టెస్ట్ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోనుంది. పలు రికార్డులతో పాటు కొన్ని అంశాలు ఈ మ్యాచ్‌ను ప్రత్యేకంగా మార్చనున్నాయి. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు ఇది కెరీర్‌లో 100వ టెస్ట్. ఈ మైలు రాయిని అందుకున్న ఇంగ్లండ్ క్రికెటర్‌గా బెన్ స్టోక్స్ చరిత్రకెక్కనున్నాడు.

ఇక టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల క్లబ్‌లో చేరేందుకు ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీస్తే అతను ఈ ఫీట్ సాధిస్తాడు. భారత్ తరఫున ఈ ఘనతను అందుకున్న రెండో బౌలర్‌గా చరిత్రకెక్కుతాడు.
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ 700 వికెట్ల క్లబ్‌లో చేరేందుకు 5 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లు పడగొడితే 700 వికెట్ల మైలురాయి అందుకోనున్నాడు. ఇక భారత్ తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ టెస్ట్‌కు దూరం కావడంతో అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
అలాగే తొలి రెండు టెస్ట్‌ల్లో విఫలమైన కేఎస్ భరత్ స్థానంలో ధ్రువ్ జురెల్ అరంగేట్రం చేయనున్నాడు. ఈ ఇద్దరే కాకుండా మరో ఇద్దరూ కూడా అరంగేట్రం చేసే రేసులో ఉన్నారు. శుభ్‌మన్ గిల్ ఫిట్‌గా లేకుంటే దేవదత్ పడిక్కల్, సిరాజ్‌ను పక్కనపెడితే ఆకాశ్ దీప్ అరంగేట్ర చేయనున్నారు. ఈ రికార్డుల నేపథ్యంలోనే రాజ్ కోట్ టెస్ట్ చరిత్రలో నిలిచిపోనుంది.
తుది జట్లు:
ఇంగ్లండ్:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్‌లీ, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్.
భారత్(అంచనా):
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పటీదార్/సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, కేఎస్ భరత్/ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా/కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్/ఆకాశ్ దీప్.