భారత్‌తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్‌కు ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కీలక సలహా ఇచ్చాడు. తన బ్యాటింగ్ అప్రోచ్‌ను జోరూట్ మార్చుకోవాలని సూచించాడు. బజ్‌బాల్ అప్రోచ్‌ను పక్కనపెట్టి పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాలని కోరాడు. చివరి మూడు టెస్ట్‌ల్లో జోరూట్ తన సహజ శైలిలో ఆడాలని, లేకుంటే ఇంగ్లండ్‌కు పరాజయం తప్పదని హెచ్చరించాడు.
వైజాగ్ వేదికగా ఇటీవల ముగిసిన రెండో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరూట్ దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ పారేసుకున్నాడు. 399 పరుగుల లక్ష్యచేధనలో అతని చెత్త షాట్ ఇంగ్లండ్ పరాజయానికి బాటలు వేసింది. ఈ ఇన్నింగ్స్‌లో 10 బంతులు ఆడిన జోరూట్ రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. అశ్విన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా బౌండరీ బాదే ప్రయత్నం చేయగా.. ఎడ్జ్ తీసుకున్న బంతి షార్ట్ థర్డ్ మ్యాన్‌లో అక్షర్ చేతిలో పడింది. ఈ వికెట్ అనంతరం ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.

ఈ క్రమంలోనే తదుపరి మూడు టెస్ట్‌ల్లో జోరూట్ తన సహజ శైలిలో బ్యాటింగ్ చేయాలని మైకేల్ వాన్ సూచించాడు. 'ఏ బ్యాటర్ అయిన తన సహజశైలిలో ఆడాలి. అయితే కొందరు దూకుడుగా బ్యాటింగ్ చేస్తారు. వారి శైలే అలా ఉంటుంది. అలాంటి బ్యాటర్లు దూకుడుగా ఆడితే ఎలాంటి అభ్యంతరం లేదు.
కానీ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడే జోరూట్.. బజ్‌బాల్ అప్రోచ్‌తో బ్యాటింగ్ చేయాల్సిన పనిలేదు. అతను తన సహజమైన బ్యాటింగ్‌తోనే 10 వేల టెస్ట్ పరుగులు చేశాడు. తదుపరి మ్యాచ్‌ల్లోనూ అలానే బ్యాటింగ్ చేయాలి. ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్‌లో ఎవరైనా జోరూట్‌తో మాట్లాడాలి.
సహజశైలిలో బ్యాటింగ్ చేయాలని సూచించాలి. స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఆడే ఇంగ్లండ్ బ్యాటర్లలో గ్రహం గూచ్ తర్వాత జోరూట్ ఒకడు. రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అతను తన శైలికి భిన్నంగా ఆడాడు. ఇంగ్లండ్ బ్యాటర్లు వికెట్లు పారేసుకోకుంటే భారత గడ్డపై విజయం సాధించగలదు.'అని ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్‌కు రాసిన కాలమ్‌లో మైకేల్ వాన్ పేర్కొన్నాడు.
మైకేల్ వాన్ కామెంట్స్‌ను కోట్ చేస్తూ భారత అభిమానులు మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. 'ఒరేయ్ రూటూ.. ఈ బజ్ బాల్.. గిజ్‌బాల్ వద్దురా అయ్యా!'అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. తొలి రెండు టెస్ట్‌ల్లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలవగా.. మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా ప్రారంభం కానుంది. 10 రోజుల గ్యాప్ రావడంతో ఇంగ్లండ్ జట్టు అబుదాబి వెకేషన్‌కు వెళ్లింది. మ్యాచ్ ప్రారంభానికి రెండు రోజుల ముందు భారత్‌కు తిరిగి రానుంది.