టీమిండియా యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు ఎమ్‌జీ మోటార్స్ ఇండియా సంస్థ భారీ బహుమతిని ప్రకటించింది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో(90, 39 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో ధ్రువ్ జురెల్ ఆకట్టుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. కెరీర్ రెండో మ్యాచ్‌లోనే మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన ధ్రువ్ జురెల్‌కు ఎమ్‌జీ మోటార్స్ ఇండియా సంస్థ భారీ బహుమతిని ప్రకటించింది.

దాదాపు రూ. 16 లక్షల విలువ గల ఎమ్‌జీ హెక్టార్ కారును ధ్రువ్ జురెల్‌కు బహుమతిగా అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడదల చేసింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ధ్రువ్ జురెల్.. ఫస్ట్ మ్యాచ్‌లోనే 46 పరుగులతో సత్తా చాటాడు. కీపింగ్‌లో ఓ క్యాచ్ అందుకోవడంతో పాటు స్టంపౌట్ చేశాడు.
రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో అదే జోరును కొనసాగించిన ధ్రువ్ జురెల్.. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును అసాధారణ బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. టెయిలెండర్ కుల్దీప్ యాదవ్(28)తో కలిసి 8వ వికెట్‌కు 86 పరుగులు జోడించాడు. ఆకాశ్ దీప్(9)తో కలిసి 9వ వికెట్ 40 పరుగులు జోడించి ఇంగ్లండ్ భారీ ఆధిక్యానికి గండి కొట్టాడు.
ధ్రువ్ జురెల్ అసాధారణ బ్యాటింగ్ ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. 192 పరుగుల లక్ష్యచేధనతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్.. 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ రేగింది. కానీ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ధ్రువ్ జురెల్(39 నాటౌట్)కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో భారత్ విజయం లాంఛనమైంది.
ధ్రువ్ జురెల్ త్వరగా ఔటై ఉంటే టీమిండియా పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. దాంతోనే అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. కెరీర్‌లోనే గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడిన ధ్రువ్ జురెల్‌కు ఎమ్‌జీ మోటర్స్ భారీ బహుమతి ప్రకటించింది. ఆటగాళ్లకు కార్లను బహుతులుగా ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్ర భారత ఆటగాళ్లకు థార్ కార్లను గిఫ్ట్‌గా అందజేశారు.