ఇంగ్లండ్ వర్సెస్ భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 3 వికెట్లకు 145 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(13), శుభ్‌మన్ గిల్(16) నిరాశపర్చినా.. కరుణ్ నాయర్(40), రిషభ్ పంత్(13 బ్యాటింగ్)తో కలిసి కేఎల్ రాహుల్(113 బంతుల్లో 5 ఫోర్లతో 53 బ్యాటింగ్) అజేయ హాఫ్ సెంచరీతో భారత్‌ను ఆదుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ తలో వికెట్ తీసారు. భారత్ ఇంకా 242 పరుగుల వెనుకంజలో ఉంది.
అంతకుముందు 251/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకే ఆలౌటైంది. జోరూట్(199 బంతుల్లో 10 ఫోర్లతో 104) సెంచరీతో రాణించగా.. జెమీ స్మిత్(56 బంతుల్లో 6 ఫోర్లతో 51), బ్రైడన్ కార్స్(83 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. బెన్ స్టోక్స్(44), ఒలీ పోప్(44) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(5/74) ఐదు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/85), నితీష్ కుమార్ రెడ్డి(2/62) రెండేసి వికెట్లు పడగొట్టారు.

రెండో రోజు ఆట ఆరంభంలోనే జోరూట్ 192 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ ఆనందం ఎంతో సేపు కూడా లేదు. జస్‌ప్రీత్ బుమ్రా నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ వరుస ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్ బెన్ స్టోక్స్(44)ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా.. తన మరుసటి ఓవర్‌లో సెంచరీ హీరో జోరూట్(104)తో పాటు క్రిస్ వోక్స్(0)ను గోల్డెన్‌డక్‌గా పెవిలియన్ చేర్చాడు. మధ్యలో సిరాజ్ బౌలింగ్‌లో జెమీ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అతను చెలరేగాడు. బ్రైడన్ కార్స్‌తో కలిసి దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లండ్ 353/7 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
రెండో సెషన్ ఆరంభంలోనే జెమీ స్మిత్‌ను సిరాజ్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. జోఫ్రా ఆర్చర్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేసి బుమ్రా ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. హాఫ్ సెంచరీ బాదిన బ్రైడ్ కార్స్(56)ను సిరాజ్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయింది. 4 ఏళ్ల తర్వా రీఎంట్రీ ఇచ్చిన జోఫ్రా ఆర్చర్ తన తొలి ఓవర్‌నే మెయిడిన్ ఓవర్‌గా మార్చి ఇంగ్లండ్‌కు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. క్రీజులోకి కరుణ్ నాయర్ రాగా.. రాహుల్ ఆచితూచి ఆడాడు. దాంతో భారత్ 44/1 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది. అనంతరం మరింత నిలకడగా ఆడిన ఈ జోడీ క్రీజులో సెట్ అయ్యింది. అయితే బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో స్లిప్‌లో జోరూట్ స్టన్నింగ్ క్యాచ్ పట్టుకోవడంతో కరుణ్ నాయర్ పోరాటం ముగిసింది. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ కూడా ఆచితూచి ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని క్రిస్ వోక్స్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చింది. క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ సాయంతో రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో అతను 97 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పంత్ అతనికి అండగా ఆడి మరో వికెట్ పడకుండా రెండో రోజు ఆటను ముగించాడు.