పిచ్ కండిషన్స్‌ను అంచనా వేయడంలో విఫలమవడంతో పాటు బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమిని శాసించిందని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తీ, బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. హ్యారీ బ్రూక్(17), జోఫ్రా ఆర్చర్(12) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్.. అభిషేక్ శర్మ (34 బంతుల్లో 5 ఫోర్లు,8 సిక్స్‌లతో 79) విధ్వంసకర బ్యాటింగ్‌తో 12.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మతో పాటు సంజూ శాంసన్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 26), తిలక్ వర్మ(16 బంతుల్లో 3 ఫోర్లతో 19 నాటౌట్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/21) రెండు వికెట్లు తీయగా..ఆదిల్ రషీద్‌కు ఓ వికెట్ దక్కింది.
మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన జోస్ బట్లర్.. టీమిండియా తమ కంటే మెరుగ్గా ఆడిందని కొనియాడాడు. 'పిచ్ మేం ఊహించిన విధంగా లేదు. ఆరంభంలోనే కీలకమైన వికెట్లు కోల్పోయాం. బ్యాటింగ్ చేయగల వికెట్‌పై మా బ్యాటర్లు రాణించలేకపోయారు. జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు.
మార్క్ వుడ్ వేగంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా మేం ఇదే దూకుడు కొనసాగిస్తాం. అయితే వేదికను బట్టి అక్కడి పరిస్థితులను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆటను ఆస్వాదించడం ఎప్పుడూ ఉంటుంది. నేను ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాను. బ్రెండన్ మెక్‌కల్లమ్‌కు నేను పెద్ద అభిమానిని. అతనితో పనిచేయడాన్ని నేను ఆస్వాదిస్తాను.'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.